Supreme Court : విపక్షాలకు సుప్రీం షాక్‌!

ABN , First Publish Date - 2023-04-06T01:47:58+05:30 IST

సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తదితర కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ పిటిషన్‌ దాఖలు

Supreme Court : విపక్షాలకు సుప్రీం షాక్‌!

రాజకీయ నేతలకు విడిగా మార్గదర్శకాలు ఎలా ఇస్తాం?

వారు కూడా దేశ పౌరులే.. అత్యున్నత పీఠంపై లేరు

చట్టం అందరికీ సమానమే.. ఏ మినహాయింపులూ ఇవ్వం

వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తే మా ముందుకు రావచ్చు

వాస్తవాలు, పత్రాల ఆధారంగా చట్టప్రకారం గైడ్‌లైన్స్‌

చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం స్పష్టీకరణ

పిటిషన్‌ ఉపసంహరించుకున్న పార్టీలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తదితర కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ పిటిషన్‌ దాఖలు చేసిన 14 ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దీనిపై విచారణకు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం నిరాకరించింది. ప్రతిపక్షాలపై వివక్షాపూరితంగా ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని.. భవిష్యత్‌లో ఇలాంటిది తలెత్తకుండా మార్గదర్శకాలివ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. చట్టం ముందు అందరూ సమానమేనని.. రాజకీయ నేతలకు విడిగా మార్గదర్శకాలు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. రాజకీయ నాయకులేమీ అత్యున్నత పీఠంపై లేరని.. వారూ దేశ పౌరులేనని.. వారికి ఎలాంటి మినహాయింపులూ ఉండవని స్పష్టం చేసింది. రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని తారుమారు చేయడానికి సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కక్షపూరితంగా ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్‌జేడీ, బీఆర్‌ఎస్‌, టీఎంసీ, ఆప్‌, ఎన్‌సీపీ, శివసేన (ఉద్ధవ్‌), జేడీయూ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, సమాజ్‌వాదీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు సంయుక్తంగా ఈ పిటిషన్‌ వేశాయి. వాటి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. అసమ్మతి అనే ప్రాథమిక హక్కును ఉపయోగించుకున్నందుకు విపక్ష నేతలు, పౌరులపై క్రిమినల్‌ కేసులు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2014 మేలో మోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిందని.. ఇప్పటివరకు 124 మంది రాజకీయ నేతలపై సీబీఐ దర్యాప్తు చేసిందని.. వీరిలో 108 మంది ప్రతిపక్షాలకు చెందినవారని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. 2004-14 నడుమ సీబీఐ 72 మంది రాజకీయ నాయకులపై దర్యాప్తు చేస్తే.. వారిలో 43 మంది మాత్రమే ప్రతిపక్షాలకు చెందినవారని. ఇది సుమారు 60 శాతమని.. కానీ ఇప్పుడది 95 శాతానికి పెరిగిందని తెలిపారు. 2014కి ముందు నేతలపై ఈడీ దర్యాప్తు చేసిన కేసులు 53 శాతం ఉండగా.. ఆ తర్వాత 95 శాతానికి పెరిగాయన్నారు. సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో సమపోటీ లేకుండా పోయిందని.. అందుకే 21వ అధికరణ కింద వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇచ్చేలా మార్గదర్శకాలివ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ గణాంకాలు చూసి దర్యాప్తు నుంచి మినహాయింపు ఇవ్వాలంటారా అని ప్రశ్నించింది. ‘గణాంకాలు చూపి మార్గదర్శకాలు పొందాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ లెక్కలన్నీ నేతలకు సంబంధించినవే. కానీ వారి కోసం ప్రత్యేక మార్గదర్శకాలు మేం ఇవ్వలేం. వారు కూడా సామాన్య పౌరులతో సమానమే. తమకు ఉన్నతమైన గుర్తింపు కావాలని వారు అనుకోరాదు. ఎంపిక చేసుకుని ఈడీ, సీబీఐ ద్వారా తమను టార్గెట్‌ చేశారని భావిస్తే ఒకట్రెండు ఘటనలతో మా వద్దకు రండి.. చట్టం ఆధారంగా వాస్తవాల ప్రాతిపదికన అందరికీ వర్తించే గైడ్‌లైన్స్‌ ఇస్తాం’ అని చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఎలాంటి వాస్తవాల్లేకుండా మార్గదర్శకాలు జారీచేయడం ప్రమాదకరమని తెలిపారు. సామూహిక అరెస్టులు ప్రజాస్వామ్యానికి ముప్పని.. నియంతృత్వానికి సూచికని.. విచారణ ప్రక్రియే శిక్షగా మారుతోందని సింఘ్వీ అన్నారు. చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ.. ప్రతిపక్షాలకు స్థానం కుంచించుకుపోతోందని అంటే.. పరిష్కారం రాజకీయంగానే ఉందని.. కోర్టులో లేదని స్పష్టం చేశారు. ఫలానా కేసులో ఫలానా వారికి ఉపశమనం కల్పించాలని తాను కోరడం లేదని.. పిటిషన్లు వేసిన రాజకీయ పార్టీలు దేశంలో 42 శాతం ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని.. అవి ప్రభావితమైతే ప్రజలూ ప్రభావితమైనట్లేనని.. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని సింఘ్వీ అన్నారు.

బెయిలివ్వండి.. జైళ్లు వద్దు

శారీరక హింస వంటి తీవ్ర నేరాలు తప్ప మిగతా నేరాల్లో అరెస్టులు, బెయిళ్లకు సంబంధించి మూడంచెల పరీక్ష చేపట్టాలని.. ఈ విషయంలో ఈడీ, సీబీఐ, కోర్టులు ఒకేరకంగా వ్యవహరించేలా ఆదేశించాలని సింఘ్వీ సుప్రీంకోర్టును కోరారు (మూడంచెల పరీక్ష అంటే.. నిందితుడు పారిపోయే ప్రమాదముందా.. అతడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా.. సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం వంటివి చేస్తాడా అని మూడు రకాలుగా నిర్ధారించుకోవడం). హింసకు సంబంధం లేని నేరారోపణలు ఉన్న కేసుల్లో బెయిలివ్వాలని.. జైలు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇదిలా ఉండగా, ప్రార్థనా స్థలాల చట్టం-1991లోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసులు ఇచ్చింది.

వర్చువల్‌ విచారణకు ఓకే

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయవాదుల వాదనలు వినేందుకు సుముఖంగా ఉన్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు. దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులపై వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలను చూశామని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్ధివాలాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. వర్చువల్‌గా లేదా హైబ్రిడ్‌ మోడ్‌ ద్వారా న్యాయవాదులు హాజరుకావడానికి సుముఖంగా ఉన్నామంటూ వెల్లడించింది.

Updated Date - 2023-04-06T03:52:23+05:30 IST