Share News

గాజాలో వృద్ధుల విలవిల!

ABN , First Publish Date - 2023-11-18T04:55:30+05:30 IST

ఇజ్రాయెల్‌ ముట్టడిలో ఉన్న గాజాలో వృద్ధులు.. వసతులు, వనరుల్లేక విలవిల్లాడిపోతున్నారు.

గాజాలో వృద్ధుల విలవిల!

రాత్రిళ్లు 17 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. శిబిరాల్లో అరకొర వసతులు

దుప్పట్లు, రగ్గులకు తీవ్రమైన కొరత

హమాస్‌ సొరంగాల్లోకి వేటకుక్కలు

జ్రాయెల్‌ ముట్టడిలో ఉన్న గాజాలో వృద్ధులు.. వసతులు, వనరుల్లేక విలవిల్లాడిపోతున్నారు. నిర్వాసితుల కోసం ఐక్య రాజ్య సమితి(ఐరాస) నిర్వహిస్తున్న శిబిరాల్లోనూ అరకొర వసతులతో ఇక్కట్లపాలవుతున్నారు. వర్షాకాలం మొదలవ్వడం.. రాత్రి ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు పడిపోతుండడం.. అంటువ్యాధుల ముప్పు వృద్ధుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. దుప్పట్లు, రగ్గులకు తీవ్ర కొరత ఉంది. గాజా, వెస్ట్‌బ్యాంక్‌ మొత్తం జనాభాలో వృద్ధుల వాటా 6ు. వీరిలో 2.6 లక్షల మంది గాజాలో ఉన్నారు. వీరిలో 69ు మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 11,500 మంది పాలస్తీనీలు చనిపోగా.. మృతుల్లో 627 మంది వృద్ధులున్నారు.

వెయ్యి మందికి ఒక టాయ్‌లెట్‌

దక్షిణ గాజాలోని శరణార్థి శిబిరాల్లో ప్రతి వెయ్యి మందికి ఒకటి చొప్పున టాయ్‌లెట్లున్నాయి. అక్కడ పరిస్థితిని మజౌజా నసీర్‌ అనే 86 ఏళ్ల వృద్ధురాలు అంతర్జాతీయ మీడియాకు వివరించారు. ‘‘టాయ్‌లెట్ల వద్ద భారీ క్యూలైన్లుంటాయి. ఐదారు గంటలు నిలబడితే తప్ప.. లోపలికి వెళ్లలేం. ఈ పరిస్థితి వృద్ధులు, మహిళల పాలిట శాపమే. అసలే అన్నపానీయాలు దొరకడం లేదు. దొరికిన ఆహారాన్ని తిందామన్నా.. మరుగుదొడ్ల వద్ద క్యూలైన్ల భయంతో పస్తులుంటున్నాం’’ అని ఆమె వివరించారు. ఇలాంటి చర్యల వల్ల వృద్ధులు, మహిళలు ఉన్నవ్యాధులకు తోడు కొత్త రుగ్మతలను కొనితెచ్చుకునే ప్రమాదముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టైప్‌-1 మధుమేహులకు ఇన్సూలిన్‌లు దొరకడం లేదని చెప్పారు. హృద్రోగులు, క్యాన్సర్‌, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా సరైన ఔషధాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలోని యుద్ధ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో మృతదేహాలు, జంతువుల కళేబరాలకు తోడు.. వర్షాల కారణంగా అంటువ్యాధుల ముప్పు పొంచి ఉందని, ఐరాస క్యాంపుల్లోనూ అపరిశుభ్రత రాజ్యమేలుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆగని కాల్పులు.. యుద్ధం

గాజాపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) తెరిపినివ్వకుండా కాల్పులు జరుపుతోంది. అల్‌-షిఫా ఆస్పత్రిలో మూడు విభాగాలను ధ్వంసం చేసినట్లు అల్‌-హుర్రా న్యూస్‌ చానల్‌ పేర్కొంది. హమా్‌సతోపాటు.. ‘ఇస్లామిక్‌ జిహాద్‌’ సంస్థకు చెందిన పలు స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. సొరంగాల్లో హమాస్‌ బాబీట్రా్‌పలు ఉండడంతో.. ఇజ్రాయెల్‌ సైన్యం వేటకుక్కలు, రోబోలను పంపుతోంది. గురువారం హమాస్‌ పాలిట్‌ బ్యూరో చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే ఇంటిని ధ్వంసం చేసింది. ఖాన్‌యూనిస్‌ నగరంలోనూ పౌరులంతా ఇళ్లను ఖాళీ చేసి, దక్షిణాదికి వెళ్లిపోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది. దీన్ని బట్టి ఆ నగరంపైనా ముప్పేట దాడులకు ఐడీఎఫ్‌ సిద్ధమైన్నట్లు స్పష్టమవుతోంది. అల్‌-షిఫా ఆస్పత్రి పక్కనే ఉన్న ఓ భవనంలో ఇద్దరు బందీల మృతదేహాలు లభ్యమైనట్లు ఐడీఎఫ్‌ తెలిపింది.

సౌదీలో గాజా మద్దతుదారుల అరెస్టులు

మక్కా, మదీనా లాంటి పవిత్ర స్థలాల్లో గాజాకు మద్దతు పలుకుతున్నవారిని, పాలస్తీనా కోసం ప్రార్థనలు చేస్తున్నవారిని సౌదీ అరేబియా ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడం గమనార్హం. పాలస్తీనా కెఫియా(నెత్తికి చుట్టుకునే దుపట్టా వంటిది), తస్బీ(మాల)ను కూడా సౌదీ సర్కారు అనుమతించడం లేదు. గాజాలో పరిస్థితులపై ఎలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయవద్దని సౌదీ గ్రాండ్‌ మాస్క్‌ మత వ్యవహారాల అధిపతి అబ్దుల్‌ రెహ్మాన్‌ విజ్ఞప్తి చేశారు.

- సెంట్రల్‌ డెస్క్‌

మరణాలను ఖండించిన మోదీ

హమా్‌స-ఇజ్రాయెల్‌ యుద్ధంలో పౌరుల మరణాలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌ సమ్మిట్‌’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దక్షిణాది ఏకమయ్యే సమయం ఆసన్నమైందని, ప్రపంచానికి దక్షిణాది గొంతుకను వినిపించాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-18T04:55:31+05:30 IST