Manipur CM Birena Singh :రాజీనామా చేస్తా.. తూచ.. చెయ్యను
ABN , First Publish Date - 2023-07-01T02:51:32+05:30 IST
మణిపూర్ సీఎం బీరేన సింగ్ రాజీనామా వ్యవహారం శుక్రవారం కలకలం రేపింది. బీరేన సింగ్ రాజీనామా చేస్తారని, మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్‌ను కలుస్తారని శుక్రవారం జోరుగా వార్తలు వినిపించాయి.
మణిపూర్ సీఎం బీరేన రాజీనామా హైడ్రామా
చింపేసిన రాజీనామా లేఖ వైరల్
ఇంఫాల్, జూన 30: మణిపూర్ సీఎం బీరేన సింగ్ రాజీనామా వ్యవహారం శుక్రవారం కలకలం రేపింది. బీరేన సింగ్ రాజీనామా చేస్తారని, మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్‌ను కలుస్తారని శుక్రవారం జోరుగా వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు అనుగుణంగానే. శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీరేన రాజ్‌భవనకు బయల్దేరారు. కానీ అప్పటికే వేలాది మంది మద్దతుదారులు అక్కడికి చేరుకుని రాజీనామా చేయొద్దంటూ నిరసనకు దిగడంతో బీరేన సింగ్ కాన్వాయ్ ముందుకు సాగడం కష్టమైంది. దీంతో ఆయన వెనుదిరిగారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే మణిపూర్ ప్రజాపనుల శాఖ మంత్రి సీఎం నివాసం నుంచి బయటకు వచ్చి.. సీఎం రాజీనామా చేయట్లేదని ప్రకటించారు. గవర్నర్‌కు ఇవ్వడానికి సీఎం సిద్ధం చేసిన రాజీనామా లేఖను.. అక్కడ నిరసన తెలపడానికి వచ్చిన మహిళల చేతికి ఇచ్చారు. వారు ఆ లేఖను అక్కడే చించేశారు. ఆ చింపేసిన రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత, బీరేనసింగ్ కూడా.. సీఎం పదవికి రాజీనామా చేయట్లేదన్న విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రకటించారు.