Dalai Lama: వైద్య పరీక్షల కోసం ఢిల్లీకి దలైలామా..
ABN , First Publish Date - 2023-10-08T14:47:55+05:30 IST
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వైద్య పరీక్షల కోసం ఆదివారంనాడు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన తన కారులోంచి దిగి సిటీలోకి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ పోలీస్ కాన్వాయ్ అవసరమైన ఏర్పాట్లు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి ఆయన ఉదయమే ఢిల్లీకి బయలుదేరారు.
న్యూఢిల్లీ: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) వైద్య పరీక్షల కోసం ఆదివారంనాడు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన తన కారులోంచి దిగి సిటీలోకి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ పోలీస్ కాన్వాయ్ అవసరమైన ఏర్పాట్లు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి ఆయన ఉదయమే ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట టిబెట్ సాధువులు కాంగ్రా విమానాశ్రయానికి వచ్చారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అక్టోబర్ 2-3 తేదీల్లో తైవానీస్ టీచింగ్స్ సెషన్స్‌కు దలైలామా హాజరుకావాల్సి ఉండగా ఆరోగ్యం బాగోలేనందున వెళ్లలేకపోయారు. సిక్కింలో జరపాల్సిన పర్యటనను కూడా ఆయన వాయిదా వేసుకున్నారు. కాగా, దలైలామా మరో రెండు మూడు రోజుల్లో తిరిగి వెనక్కి వస్తారని, ఆందోళన చెందాల్సిన పని లేదని దలైలామా వ్యక్తిగత కార్యదర్శి రిగ్జిన్ తెలిపారు. ఢిల్లీలోని హోటల్‌లో ఈరోజు బస చేసి అనంతరం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకుంటారని చెప్పారు. కాగా, దీనికిముందు సిక్కింలో వరదల్లో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరగడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌కు రాసిన లేఖలో దలైలామా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రకృతి విలయం నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. సిక్కిం ప్రజలకు సంఘీభావంగా సహాయ, పునరావాస చర్యలకు విరాళం అందజేయాలని దలైలామా ట్రస్టును కోరినట్టు తెలిపారు.