Bhupinder Singh: యువకుడిని తుపాకీతో కాల్చి హత్య..‘తమ్ముడు’ సినిమా విలన్ అరెస్ట్
ABN , First Publish Date - 2023-12-07T18:56:59+05:30 IST
‘తమ్ముడు’ వంటి హిట్ సినిమాతో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ నటుడు, టీవీ యాక్టర్ భూపీందర్ సింగ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘తమ్ముడు’ వంటి హిట్ సినిమాతో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ యాక్టర్ భూపీందర్ సింగ్‌ను (Bhupinder Singh) ఉత్తర్‌ప్రదేశ్ (Uttarpradesh) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో పొరుగింటివారిపై కాల్పులు జరిపి ఒకరి మరణానికి కారణమైనందుకు నటుడిని అరెస్టు చేశారు. పొలం సరిహద్దుకు కంచె ఏర్పాటు చేసే విషయంలో తెలెత్తిన వివాదం ఈ ఘటనకు దారి తీసినట్టు సమాచారం.
భూపీందర్ సింగ్‌కు బిజ్నోర్‌లో పొలం ఉంది. ఈ పొలానికి కంచె వేసేందుకు అక్కడున్న చెట్లను కొట్టేసే సమయంలో భూపీందర్‌కు, పొరుగున ఉన్న గుర్దీప్ సింగ్‌కు మధ్య వివాదం తలెత్తింది. చూస్తుండగానే ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో భూపీందర్, అతడి వెంట ఉన్న మరో ముగ్గురు సహాయకులు గుర్దీప్ కుటుంబంపై దాడికి దిగారు. ఈ గొడవలో భూపీందర్ తన వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో గుర్దీప్ కుటుంబంపై కాల్పులు జరిపాడు. దీంతో గుర్దీప్ కుమారుడు గోవింద్ (22) అక్కడికక్కడే మరణించాడు. గుర్దీప్ భార్య బీరో బాయ్, వారి మరో కుమారుడు అమ్రీక్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భూపీందర్‌పై హత్య, హత్యాయత్నం, కావాలని గాయపరచడం తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయుధాల చట్టం కింద కూడా నటుడిపై కేసు పెట్టారు.
ఉత్తరాది సినీ, టీవీ ప్రేక్షకులకు చిరపరిచితుడైన భూపీందర్ సింగ్ ‘యే ప్యార్ న హోగా కమ్‘, ‘మధుబాల’ వంటి టీవీ సీరియళ్లతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ‘తమ్ముడు’, ‘దేవీ పుత్రుడు’, ‘అన్నయ్య’, ‘భలేవాడివి బాసూ’, ‘విలన్’, ‘అంజి’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులనూ మెప్పించాడు.