Indo-Bangladesh Love Story: మరో బార్డర్ లవ్ స్టోరీ.. ఈసారి అమ్మాయి బంగ్లాదేశీ
ABN , First Publish Date - 2023-07-27T18:11:12+05:30 IST
అదేదో జనాలు క్యూ కట్టినట్టు.. ఇప్పుడు బార్డర్ లవ్ స్టోరీలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తొలుత సీమా-సచిన్‌ల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపగా..
అదేదో జనాలు క్యూ కట్టినట్టు.. ఇప్పుడు బార్డర్ లవ్ స్టోరీలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తొలుత సీమా-సచిన్‌ల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపగా.. ఆ తర్వాత అంజు-నస్రుల్లా జంట కథ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ రెండు లవ్ స్టోరీలపై రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ట్విస్టులు కూడా ఒకదాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరో బార్డర్ లవ్ స్టోరీ వ్యవహారంలో ఒక కొత్త ట్విస్ట్ తెరమీదకి వచ్చింది. ఇది ఇండో-బంగ్లాదేశ్ లవ్ స్టోరీ. ఈ కథలో భారతదేశానికి చెందిన వ్యక్తి బంగ్లాదేశీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన అజయ్‌కు 2017లో ఫేస్‌బుక్‌లో జూలీ అనే మహిళ పరిచయం అయ్యింది. మొదట్లో వీళ్లు కామన్ ఫ్రెండ్‌లాగా చాటింగ్ చేసుకునేవారు. రోజులు గడిచేకొద్దీ.. వీరి మధ్య చాటింగ్ పెరగడం, ఇద్దరి ఇష్టాలు కలవడం, ఆపై ప్రేమ చిగురించడం జరిగింది. నిజానికి.. జూలీకి అప్పటికే పెళ్లి అయ్యింది. అయినా.. ఆమె అజయ్‌తో చాటింగ్ చేసింది. 2022 జూలీ భర్త చనిపోయినప్పుడు.. తామిద్దరం పెళ్లి చేసుకోవాలని అజయ్, జూలీ నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆమె ఇండియాకు వచ్చింది. హిందూ సంప్రదాయాల ప్రకారం వీళ్లు మొరదాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత పని నిమిత్తం అజయ్ కర్ణాటకకు వెళ్లాడు. అయితే.. ఇక్కడ అత్తాకోడళ్ల మధ్య గొడవ అవుతోందన్న విషయం తెలిసి, కొన్ని రోజుల్లోనే అతడు మొరాదాబాద్‌కు తిరిగొచ్చేశాడు.
అత్తాకోడళ్ల మధ్య సమస్యని పరిష్కరించాలని అజయ్ ప్రయత్నించాడు. కానీ, జూలీ మాత్రం ఇకపై ఇక్కడ ఉండనంటూ తిరిగి బంగ్లాదేశ్‌కి తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోయింది. జూలీ వెళ్లిపోయాక తల్లితో అజయ్ గొడవపడ్డాడు. అప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోమ్మని తల్లి చెప్పడంతో.. కోపంలో తాను బంగ్లాదేశ్‌కి వెళ్లిపోతానని చెప్పాడు. కట్ చేస్తే.. రీసెంట్‌గా అజయ్ తల్లి ఫోన్‌కు బంగ్లాదేశీ నంబర్ నుంచి ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో అజయ్‌కి దెబ్బలు తగిలి ఉండటం గమనించిన తల్లి.. భయంతో పోలీసుల్ని ఆశ్రయించింది. తన కొడుకు భార్య కోసం బంగ్లాదేశ్ వెళ్లాడని, అతడ్ని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకురావాలని ప్రాధేయపడింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టగా.. రీసెంట్‌గా అజయ్ మొరాదాబాద్‌కి తిరిగొచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అజయ్‌ని విచారించారు. అప్పుడు తాను బంగ్లాదేశ్‌కే వెళ్లలేదని క్లారిటీ ఇచ్చాడు. తాను ఇన్నాళ్లూ వెస్ట్ బెంగాల్ బార్డర్‌లో ఒక ఇంట్లో అద్దెకు ఉన్నానని చెప్పాడు. మరి.. తల్లికి వచ్చిన ఫోటో సంగతేంటి? అని ప్రశ్నిస్తే, దాని గురించి తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చాడు. అయితే.. గతంలో తల్లితో గొడవ పడినప్పుడు తాను బంగ్లాదేశ్‌కి వెళ్తానని అజయ్ చెప్పాడు కాబట్టి, పోలీసులు అతనిపై ఓ కన్నేసి ఉంచారు. మరి, అజయ్ బంగ్లాదేశ్‌కి వెళ్లకపోతే.. తల్లి నంబర్‌కి బంగ్లాదేశీ నంబర్ నుంచి వచ్చిన ఫోటో ఎవరిది? ఇన్నాళ్లూ వెస్ట్ బెంగాల్ బార్డర్‌లో అజయ్ ఏం చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికాలంటే, కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే.