Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ABN , First Publish Date - 2023-06-30T10:20:13+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (Uniform Civil Code)ను వచ్చే నెలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. అనంతరం దీనిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించబోతోంది. వివిధ వర్గాల వాదనలను ఈ సంఘం స్వీకరిస్తుంది.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (Uniform Civil Code)ను వచ్చే నెలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. అనంతరం దీనిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించబోతోంది. వివిధ వర్గాల వాదనలను ఈ సంఘం స్వీకరిస్తుంది. అత్యున్నత స్థాయి విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా చానల్ ఈ వివరాలను వెల్లడించింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలైలో ప్రారంభం కాబోతున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటుకు సమర్పించి, అనంతరం దానిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించే అవకాశం ఉందని, వివిధ వర్గాల వాదనలను ఆ కమిటీ స్వీకరిస్తుందని అత్యున్నత స్థాయి విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు ఆ చానల్ తెలిపింది.
సిబ్బంది, ప్రజా సమస్యలు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల లా కమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖల ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. జూలై 3న హాజరు కావాలని ఆదేశించింది. ఉమ్మడి పౌర స్మృతి (UCC)పై అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ లా కమిషన్ జూన్ 14న జారీ చేసిన నోటీసు నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ నోటీసులను జారీ చేసింది.
సిబ్బంది, ప్రజా సమస్యలు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం షెడ్యూలు ప్రకారం, లా కమిషన్, లీగల్ అఫైర్స్, న్యాయ మంత్రిత్వ శాఖలలోని లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్స్ ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ‘వ్యక్తిగత చట్టాల సమీక్ష’ అంశంపై లా కమిషన్ వివిధ వర్గాల అభిప్రాయాలను కోరిన నేపథ్యంలో స్థాయీ సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై మూడో వారం నుంచి ప్రారంభం కావచ్చు. పాత పార్లమెంటు భవనంలో కొన్ని రోజులు సమావేశాలు జరిగిన తర్వాత, నూతన పార్లమెంటు భవనానికి మారే అవకాశం ఉంది.
మోదీ ఏమన్నారంటే..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాలవారికి, ప్రతి ఒక్కరికీ ఒకే చట్టం అమలు కావాలని చెప్పారు. ఈ సున్నితమైన అంశంపై ముస్లింలను కొందరు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నవారు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఒక దేశం రెండు రకాల వ్యవస్థలను ఎలా అమలు చేయగలదని ప్రశ్నించారు.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో యూసీసీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. భారత రాజ్యాంగంలోని అధికరణ 44 కూడా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని చెప్తోంది.
ప్రతిపక్షాల స్పందన
మోదీ వ్యాఖ్యలతో యూసీసీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలుపగా, కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింసాకాండ వంటి సమస్యలు ఉన్నాయని, ఈ అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ యూసీసీ అంశాన్ని లేవనెత్తుతున్నారని దుయ్యబడుతున్నాయి.
యూసీసీ అంటే..
ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు అమలవుతున్నాయి. హిందూ చట్టాల ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో వారసత్వ హక్కులు పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉన్నాయి. క్రైస్తవులకు వర్తించే చట్టం ప్రకారం క్రైస్తవ మహిళలకు ముందుగా నిర్ణయించిన వాటా మాత్రమే లభిస్తుంది. పిల్లలు, ఇతర బంధువులు ఉండటాన్నిబట్టి ఈ వాటా ఉంటుంది. పారశీక మతానికి చెందిన మహిళ తన భర్త మరణించినట్లయితే, తన పిల్లలతో సమాన వాటాను పొందవచ్చు. ముస్లిం మహిళలకు తమ తండ్రి ఆస్తిలో పురుషులకు లభించే వాటాలో సగం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Congress party PhonePe: కాంగ్రెస్ పార్టీకి ఫోన్‌పే హెచ్చరిక.. కారణం ఏంటో తెలుసా...
Make in India : మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు