Udhayanidhi Stalin: డీలిమిటేషన్‌పై ఉదయనిధి స్టాలిన్ ధ్వజం.. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం
ABN , First Publish Date - 2023-10-12T22:00:11+05:30 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘డీలిమిటేషన్’ అనే ఫిట్టింగ్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదైతే పొందింది కానీ.. జనాభా గణన, డీమిలిటేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాతే దాన్ని...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘డీలిమిటేషన్’ అనే ఫిట్టింగ్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదైతే పొందింది కానీ.. జనాభా గణన, డీమిలిటేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాతే దాన్ని అమల్లోకి తీసుకొస్తామంటూ బీజేపీ బీరాలు పలికింది. ఈ బిల్లుకు ప్రతిఒక్కరూ మద్దతు తెలిపారు కానీ.. దీనికి డీలిమిటేషన్ ప్రక్రియను ఎటాచ్ చేయడం పట్లే వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా.. దక్షిణాది రాష్ట్రాలు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ ప్రక్రియ జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల్లోని లోక్‌సభ సీట్లు తగ్గుముఖం పడతాయి. అందుకే.. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లతో పాటు పలువురు నేతలు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు.
ఇప్పుడు తాజాగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ డీలిమిటేషన్ ప్రక్రియపై ధ్వజమెత్తారు. ABP నెట్‌వర్క్ నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2023’ అనే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2026లో డీలిమిటేషన్ జరిగితే, దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు. 1970ల కాలంలో భారత్‌లో జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. జనాభాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఆ విధానాలను బాగా అమలు చేశాయని.. కానీ ఇతర రాష్ట్రాలు ఆ పని చేయలేదని పేర్కొన్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ ద్వారా మంచి పనులు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపణలు చేశారు.
లోక్‌సభ సీట్లను పెంచకుండా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే.. తాము (తమిళనాడు) ఎనిమిది స్థానాలు కోల్పోతాయని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని.. ఈ ప్రక్రియ జరిగితే ఆ సంఖ్య 31కి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క తమిళనాడు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు కూడా తగ్గుతాయన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియకు మరో రెండేళ్లు మాత్రమే ఉందని.. దక్షిణాది రాష్ట్రాల్లో గొంతు నొక్కే ప్రయత్నం ఇది అని నిప్పులు చెరిగారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టకూడదన్న అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తపరిచారు.