Share News

Union Minister instead of CJI : సీజేఐ బదులు కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2023-12-13T06:32:19+05:30 IST

ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కూడిన సెలెక్ట్‌ ప్యానెల్‌.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, ఇతర కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్న

 Union Minister instead of CJI : సీజేఐ బదులు కేంద్ర మంత్రి

ఎన్నికల కమిషనర్ల సెలెక్ట్‌ ప్యానెల్‌లో చోటిస్తూ రాజ్యసభలో బిల్లు ఆమోదం

కమిషనర్లకు చట్టపరంగా రక్షణ!.. వారిపై సివిల్‌/క్రిమినల్‌ చర్యలు ఉండవు

న్యూఢిల్లీ, డిసెంబరు 12: ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కూడిన సెలెక్ట్‌ ప్యానెల్‌.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, ఇతర కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తన పంతం నెగ్గించుకుంది. సదరు ప్యానెల్లో సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చుతూ తీసుకొచ్చిన బిల్లును మంగళవారం రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది. విపక్షాలు, మాజీ కమిషనర్లు అభ్యంతరం చెప్పినా వెనక్కి తగ్గలేదు. గత ఆగస్టులో తీసుకొచ్చిన బిల్లులో పలు కీలక సవరణలు చేపట్టి.. ‘కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, ఇతర కమిషనర్ల (నియామకం, సర్వీసు, విధివిధానాల నిబంధనలు)’ బిల్లును కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభలో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ల నియామకంపై పార్లమెంటు చట్టం చేసేవరకు ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన సెలెక్ట్‌ ప్యానెల్‌ వారి నియామకాలు చేపట్టాలని ఈ ఏడాది మార్చి 2న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. రాజ్యాంగంలోని 324(2) అధికరణ ప్రకారం గత ఆగస్టు 10న ప్రభుత్వం బిల్లు తెచ్చిందని తెలిపారు. అందులో సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చామన్నారు. ఆగస్టులో తెచ్చిన బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్ల సెర్చ్‌ కమిటీలో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, ఇద్దరు సీనియర్‌ అధికారులు ఉంటారని, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ఐదు పేర్లతో జాబితాను తయారు చేసి సెలెక్ట్‌ ప్యానెల్‌కు పంపుతుందని మంత్రి పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు కేబినెట్‌ కార్యదర్శి స్థానంలో కేంద్ర న్యాయమంత్రిని చేర్చారు.

మరిన్ని నిబంధనలు..

ఎన్నికల విధుల్లో ఉండే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, ఎన్నికల కమిషనర్లకు కేంద్రం బిల్లులో రక్షణ కల్పించింది. వారిపై ఎలాంటి సివిల్‌, క్రిమినల్‌ చర్యలు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కమిషనర్లను ఆషామాషీగా తొలగించడానికి వీల్లేకుండా.. కేవలం ప్రధాన కమిషనర్‌ సిఫారసు చేస్తేనే తీసివేసేలా నిబంధన చేర్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, కమిషనర్లకు సివిల్‌, క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ నుంచి రక్షణ కల్పించడానికి ప్రత్యేక నిబంధన(15ఏ)ను పొందుపరిచామని మేఘ్వాల్‌ తెలిపారు.

సుప్రీం తీర్పునకు విరుద్ధంగా..!

ఎన్నికల కమిషనర్ల సెలెక్ట్‌ ప్యానల్‌లో సీజేఐకి బదులుగా కేంద్రమంత్రికి స్థానం కల్పించడంపై సుర్జేవాలా(కాంగ్రెస్‌), రాఘవ్‌ చద్దా (ఆప్‌), తిరుచి శివ (డీఎంకే), జవహర్‌ సర్కార్‌ (టీఎంసీ) తీవ్ర అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును పక్కకునెట్టి అవమానించారని.. ఈ బిల్లు చట్ట విరుద్ధమని.. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమని.. తనకు అనుకూలురైన వ్యక్తులతో కమిషన్‌ను నింపుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చద్దా ఆరోపించారు. కాగా.. ప్రధాన కమిషనర్‌, కమిషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల హోదా కొనసాగుతుందని మేఘ్వాల్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

Updated Date - 2023-12-13T06:32:20+05:30 IST