Kishan Reddy: రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డి లిమిటేషన్ చేయాలనేది సబబు కాదు
ABN , First Publish Date - 2023-02-13T16:07:03+05:30 IST
ఢిల్లీ: దేశమంతా డి లిమిటేషన్ జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జరగలేదు.. ఇప్పుడు జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఢిల్లీ: దేశమంతా డి లిమిటేషన్ (D Limitation) జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir)లో జరగలేదు.. ఇప్పుడు జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. సోమవారం ఆయన లోక్‌సభ (Lok Sabha)లో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డి లిమిటీషన్ చేయాలనేది సబాబు కాదన్నారు. పునర్విభజన చట్టాల్లో పెట్టినంత మాత్రాన అవుతుందా? అని ప్రశ్నించారు. చట్టంలో చాలా పెట్టారని.. దీనిపై చర్చ జరగకుండా రాశారని అన్నారు.
బీజేపీ (BJP) అధికారంలోకి రాక ముందు ఉన్న చట్టాల ఆధారంగా.. జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ స్థానాల పెంపు జరుగుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కశ్మీర్‌లో చాలా చట్టాలు మారుస్తున్నారని, అంబేద్కర్ రాజ్యాంగం (Ambedkar Constitution) అమలు అవుతుందని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌ను ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దన్నారు. జమ్మూకాశ్మీర్ విషయంలో తప్పిదం జరిగింది కాబట్టి చట్టాలు మారుస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.)పై కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రంపై బురద చల్లేందుకే అసెంబ్లీని ఉపయోగించుకున్నారని, శాసనసభ వేదికగా అనేక అసత్య ఆరోపణలు చేశారని ఆరోపించారు. నిరాశ, నిస్పృహలతో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రసంగం సాగిందన్నారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి అమలు చేయలేదని విమర్శించారు. అవగాహన లేకుండా కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన సీఎం... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రగతిపై ఎందుకు చర్చ పెట్టలేదు?.. రాష్ట్రంలో కుటుంబ పాలనపై ఎందుకు చర్చ జరగలేదని నిలదీశారు.
శాసన మండలిలో కాంగ్రెస్‌ను లేకుండా చేసింది సీఎం కేసీఆరేనని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు కోసం అర్రులు చాస్తున్నారని, అందుకే కాంగ్రెస్‌ను పొగడ్తలతో ముంచెత్తారని ఆరోపించారు. రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని వస్తారా?.. రండి.. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు తాము సిద్ధమని అన్నారు. ప్రెస్‌క్లబ్‌కు వస్తారా?, అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తారా? లేక ప్రగతిభవన్‌కు.. ఫామ్‌హౌజ్‌కు చర్చకు రమ్మంటారా? అంటూ కిషన్ రెడ్డి సవాల్ చేశారు.