మొబైల్ కస్టమర్‌కు యూనీక్ ఐడీ
ABN , First Publish Date - 2023-11-08T00:55:52+05:30 IST
మొబైల్ నంబర్ల అసలు యజమానులను గుర్తించడానికి సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రతీ మొబైల్ కనెక్షన్ యజమానికి టెలికం
ఎన్ని కనెక్షన్లున్నా దానికే లింకు.. ఒకరికి తొమ్మిది మించి కనెక్షన్లు ఇవ్వరు
ఒకరి పేరుతో మరొకరికీ ఇవ్వరు.. టెలీకాల్ మోసాల అడ్డుకట్టకు చాన్స్
న్యూఢిల్లీ, నవంబరు 7: మొబైల్ నంబర్ల అసలు యజమానులను గుర్తించడానికి సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రతీ మొబైల్ కనెక్షన్ యజమానికి టెలికం శాఖ ఒక ప్రత్యేకమైన కస్టమర్ ఐడీని కేటాయిస్తుంది. ఒక వ్యక్తి దగ్గర ఎన్ని మోబైల్ నంబర్లు ఉంటే అన్ని ఈ కస్టమర్ ఐడీకి అనుసంధానం అవుతాయి. టెలికం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిదికి మించి మొబైల్ కనెక్షన్లు తీసుకోవడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుతం యూనిక్ ఐడీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఎవరో ఒకరి పేరు మీద కనెక్షన్లు తీసుకోవడం సాధ్యమవుతోంది. యూనిక్ ఐడీ వ్యవస్థ వస్తే దొంగ కనెక్షన్లను పసిగట్టే వీలుంటుంది. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించడం, మోసపూరిత కాల్స్‌కు పాల్పడే వారిని గుర్తించడం యూనిక్ ఐడీ వ్యవస్థ ద్వారా మరింత తేలిక అవుతుంది. ఒక ఫోన్ నుంచి ఫ్రాడ్ కాల్ వెళితే ఆ నంబరుతో లింక్ ఉన్న యూనిక్ ఐడీ కింద ఉన్న అన్ని ఫోన్ నంబర్లు బ్లాక్ చేసేందుకు వీలు కలుగుతుంది. డిసెంబరు 1 నుంచి సిమ్ కార్డు అమ్మకందార్లను కూడా నియంత్రించనున్నారు. సిమ్ అమ్మకందార్లంతా టెలికం ఆపరేటర్ దగ్గర నమోదు కావాలి. పక్కాగా కేవైసీ తీసుకోవాలి.