Uttarakhand: ఉత్తరాఖండ్ దుర్ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం
ABN , First Publish Date - 2023-07-19T15:43:01+05:30 IST
ఉత్తరాఖండ్ లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో (Tranformer Explosion) 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నది ఒడ్డున ఉన్న నమామి గంగా ప్రాజెక్టు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోకి కరెంట్ ప్రవహించడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.
కాగా, విద్యుదాఘాతంతో కుప్పకూలిన 15 మందిలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు హోం గార్డులు కూడా ఉన్నారని, ఘటనపై విచారణ జరుపుతున్నామని ఉత్తరాఖండ్ ఏడీజీ (శాంతి భద్రతలు) వి.మురుగేషన్ తెలిపారు.
సీఎం తీవ్ర విచారం
ట్రాన్స్‌ఫార్మర్ పేలి 16 మంది మృతి చెందిన ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి విచారం వ్యక్తం చేశారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని, జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ ఘటనా స్థలికి చేరుకున్నారని తెలిపారు. క్షతగాత్రులను హైయర్ సెంటర్‌కు తరలించామని, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్ రిషికేష్‌కు పంపుతున్నామని చెప్పారు.