Share News

UCC: యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్టంగా ఉత్తరాఖండ్..

ABN , First Publish Date - 2023-11-11T12:17:13+05:30 IST

UCC: యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్(Uttarakhand) అవతరించనుంది. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్(Justice Ranjana Desai) నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించడంతో ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్‌(Uniform Civil Code)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.

UCC: యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్టంగా ఉత్తరాఖండ్..

డెహ్రడూన్: యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్(Uttarakhand) అవతరించనుంది. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్(Justice Ranjana Desai) నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించడంతో ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్‌(Uniform Civil Code)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది. వచ్చే వారంలో ఈ కోడ్ అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి నివేదికను సమర్పించనుందని వివరించారు.

శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని దీపావళి అనంతరం నిర్వహిస్తారు. ఆ సమావేశాల్లో యూసీసీ బిల్లును సభ ఆమోదిస్తుంది. అనంతరం అది చట్ట రూపం దాలుస్తుంది. జూన్‌లో, యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ముసాయిదా కమిటీ సభ్యుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌కు యూసీసీ అమలు ముసాయిదా పూర్తయిందని, త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. ముసాయిదాతో పాటు నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని జస్టిస్ దేశాయ్ తెలిపారు. ఆ రాష్ట్రం మాదిరిగానే గుజరాత్ కూడా 2024 లోక్‌సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందు యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయవచ్చని బీజేపీ వర్గాలు తెలిపాయి.


యూసీసీ అంటే..

ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు అమలవుతున్నాయి. హిందూ చట్టాల ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో వారసత్వ హక్కులు పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉన్నాయి. క్రైస్తవులకు వర్తించే చట్టం ప్రకారం క్రైస్తవ మహిళలకు ముందుగా నిర్ణయించిన వాటా మాత్రమే లభిస్తుంది. పిల్లలు, ఇతర బంధువులు ఉండటాన్నిబట్టి ఈ వాటా ఉంటుంది. పారశీక మతానికి చెందిన మహిళ తన భర్త మరణించినట్లయితే, తన పిల్లలతో సమాన వాటాను పొందవచ్చు. ముస్లిం మహిళలకు తమ తండ్రి ఆస్తిలో పురుషులకు లభించే వాటాలో సగం లభిస్తుంది.

బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో యూసీసీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. భారత రాజ్యాంగంలోని అధికరణ 44 కూడా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని చెప్తోంది. ఈ అంశంపై ప్రధాని మోదీ గతంలో దేశంలోని అన్ని వర్గాలవారికి, ప్రతి ఒక్కరికీ ఒకే చట్టం అమలు కావాలని చెప్పారు. ఈ సున్నితమైన అంశంపై ముస్లింలను కొందరు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నవారు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఒక దేశం రెండు రకాల వ్యవస్థలను ఎలా అమలు చేయగలదని ప్రశ్నించారు.

Updated Date - 2023-11-11T12:17:52+05:30 IST