Chandrayaan-3: విజయవంతంగా విక్రమ్ ల్యాండింగ్.. అంబరాన్నంటిన సంబరాలు
ABN , First Publish Date - 2023-08-23T17:57:44+05:30 IST
చందమామపై భారత్ చెరగని ముద్రవేసింది. చరిత్రాత్మక ఘట్టంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తుండగా.. కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించగా.. రెండు రోజులక్రితం రష్యా లూనా-25 మిషన్ కుప్పకూలిన చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్‌గా (Soft landing) లాండయ్యింది.
చందమామపై భారత్ చెరగని ముద్రవేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తుండగా.. కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించగా.. రెండు రోజులక్రితం రష్యా లూనా-25 మిషన్ కుప్పకూలిన చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్‌గా (Soft landing) లాండయ్యింది. రాళ్లు, గుంతలు లేని ప్రదేశంలో సురక్షితంగా ల్యాండయ్యింది. ఈ అత్యద్భుత ఖగోళ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతోపాటు విదేశీయులు కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు.
చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్(Vikram Lander) మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడింది. దీంతో అమెరికా, సోవియెట్ యూనియన్ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇటివల చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు ప్రయత్నించిన రష్యా లూనా-25 ఈ నెల 19న జాబిల్లిపై క్రాష్ ల్యాండ్ అయిన నేపథ్యంలో చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.
ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు..
చందమామపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమవ్వడంతో బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు ఉప్పొంగిపోయారు. వర్చువల్‌గా బెంగళూరు కేంద్రంలోని శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ఉత్సాహపరిచారు. ల్యాండింగ్ విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులపై ప్రశంజల జల్లు కురిపించారు.