Dantewada Naxal attack: దంతెవాడలో మావోయిస్టుల ఘాతుకం కెమెరాకు చిక్కింది
ABN , First Publish Date - 2023-04-27T22:23:37+05:30 IST
మావోయిస్టుల దాడి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
దంతెవాడ: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దంతెవాడ జిల్లా (Dantewada district) అరణ్‌పూర్‌లో (Aranpur) నక్సలైట్లు (naxals) నిన్న ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర (IED) పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్‌ను పొట్టనపెట్టుకున్నారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు(District Reserve Guard). డీఆర్‌జీ (DRG) జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు. మొత్తం 11 మంది చనిపోయారు. మావోయిస్టుల దాడి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
దంతేవాడ జిల్లా అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్టు అందిన సమాచారం మేరకు డిస్ర్టిక్ట్ రిజర్వు గార్డ్స్ (డీఆర్‌జీ), సీఆర్‌పీఎఫ్ జవాన్లు బుధవారం కూంబింగ్‌కు వెళ్లారు. తిరిగి బెస్‌క్యాంపునకు పదిమంది జవాన్లు మినీ వ్యానులో బయల్దేరారు. జవాన్ల రాకను పసిగట్టిన మావోయిస్టులు అప్పటికే అరుణ్‌పూర్ వద్ద అమర్చిన శక్తిమంతమైన ఇంప్రూవైడ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివై్‌స(ఐఈడీ)తో జవాన్లు ప్రయాణిస్తున్న మినీవ్యాను పేల్చివేశారు. వ్యాను ఒక్కసారిగా ఎగిరి పడి తుక్కు తుక్కుగా మారింది. అందులో ప్రయాణిస్తున్న జవాన్ల శరీరభాగాలు సైతం ముక్క లు, ముక్కలుగా ఎగిరిపడ్డాయి. ఓ జవాన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. దాడిలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌తో పాటు మొత్తం పదిమంది జవాన్లు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మృత జవాన్లను రామ్‌కుమార్ యాదవ్ (హెడ్ కానిస్టేబుల్), తికేశ్వర్ ధృవ్ (అసిస్టెంట్ కానిస్టేబుల్, సీఏఎఫ్, ధమార్తీ), సాలిక్ రామ్ సిన్హా (కానిస్టేబుల్, కాంకేర్), విక్రమ్ యాదవ్ (హెడ్ కానిస్టేబుల్), రాజేశ్‌సింగ్ (కానిస్టేబుల్, ఘాజీపూర్, యూపీ), రవిపటేల్ (కానిస్టేబుల్), అర్జున్ రాజ్బర్ (కానిస్టేబుల్, సీఏఎఫ్), రాజురామ్ కర్తమ్ (కానిస్టేబుల్), జైరాం పొడియం (కానిస్టేబుల్), జగదీశ్ కవాసి (కానిస్టేబుల్)తో పాటు డ్రైవర్ ధనిరామ్ యాదవ్ ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కేంద్ర బలగాలు మావోయిస్టుల కోసం అడవులను జల్లెడ పడుతున్నాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజన్ ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
దాదాపు రెండేళ్లుగా మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎటువంటి చర్యలకు దిగడం లేదు. చిన్నా చితక ఘటనలు తప్ప చెప్పుకోదగ్గ భారీదాడులు లేవు. దానివల్ల కూంబింగ్‌కు వెళ్లిన జవాన్లు కాస్త నిర్లక్ష్యంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల సీఆర్‌పీఎఫ్ బలగాలు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం నుంచి నక్సల్స్‌ను ఏరివేసే లక్ష్యంతో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు మందుపాతరతో ఒక్క సారిగా విరుచుకుపడ్దారు. ఈ దాడి నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. దాడిలో పాల్గొన్న నక్సల్స్ తెలంగాణ వైపు రావచ్చనే అనుమానంతో సరిహద్దుల్లో సోదాలు చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులపై నక్సల్స్ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ‘ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు నివాళి అర్పిస్తున్నా. వారి త్యాగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మోదీ బుధవారం ట్వీట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేసి దాడి వివరా లు తెలుసుకొన్నారు. నక్సల్స్ వ్యతిరేక పోరుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టులను వదిలే ప్రసక్తే లేదని సీఎం భూపేశ్ భఘేల్ హెచ్చరించారు.
నక్సల్స్ దాడిని పిరికిపందల చర్యగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మృతులకు నివాళి అర్పించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు.