Modi - Putin: ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే?

ABN , First Publish Date - 2023-08-28T20:50:00+05:30 IST

ప్రతిష్టాత్మక జీ20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సదస్సుకు 29 మంది దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు...

Modi - Putin: ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే?

ప్రతిష్టాత్మక జీ20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సదస్సుకు 29 మంది దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. కానీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని ఇటీవల క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది. జీ20 సమ్మిట్ కోసం పుతిన్ భారత్‌కు రావడం లేదని, ప్రస్తుతం తమ దృష్టంతా సైనిక చర్య మీదే ఉందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. వర్చువల్‌గా పాల్గొంటారా? లేదా? అన్న విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేదు.


ఈ నేపథ్యంలోనే పుతిన్‌తో ప్రధాని మోదీ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కొన్ని కారణాల వల్ల తాను జీ20 సదస్సుకు హాజరుకాలేనని మోదీకి పుతిన్ తెలియజేశారు. తన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను పంపుతున్నట్టు మోదీకి పుతిన తెలిపినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాల్ సందర్భంగా పుతిన్ పరిస్థితిని అర్థం చేసుకున్న మోదీ.. జీ20 సమ్మిట్‌కు అధ్యక్షత వహించేందుకు భారత్‌కు మద్దతు తెలిపినందుకు రష్యాకు కృతజ్ఞతలు తెలిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఈరోజు ఉదయాన్నే భారతదేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్.. G20 సమ్మిట్‌లో తమ దేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోబడుతుందని చెప్పిన కొన్ని గంటల్లోనే పుతిన్ ఇలా మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.

అయితే.. పుతిన్ ఈ జీ20 సమ్మిట్‌కి హాజరుకాకపోవడానికి మరో బలమైన కారణం ఉందని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి పుతిన్‌పై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా.. ఉక్రెయిన్‌లోని పిల్లలను రష్యా అపహరించిందన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి పుతిన్ విదేశీ పర్యటనల్ని ఆపేశారు. ఒకవేళ విదేశాలకు వెళ్తే.. ఆయన్ను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఈ కారణం వల్లే.. బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరు కాలేదు. కేవలం వర్చువల్‌గా మాత్రమే ఆ సదస్సుకు హాజరయ్యారు. ఇప్పుడు భారత్‌లో జరగబోయే జీ20 సమ్మిట్‌కు దూరంగా ఉంటున్నారు.

Updated Date - 2023-08-28T20:50:00+05:30 IST