Share News

Himanta Biswa Sarma: అరగంటలో పేరు మార్చేస్తాం.. అస్సాం సీఎం హిమంత సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2023-11-27T15:50:22+05:30 IST

మత రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్తూనే.. ప్రాంతాల పేర్ల విషయంలో బీజేపీ సరికొత్త వివాదాలకు తెరలేపుతోంది. ముస్లిం పేర్లున్న ప్రాంతాలను టార్గెట్ చేసుకొని, వాటి పేర్లు మారుస్తూ సంచలనాలకు దారితీస్తుంది.

Himanta Biswa Sarma: అరగంటలో పేరు మార్చేస్తాం.. అస్సాం సీఎం హిమంత సంచలన ప్రకటన

మత రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్తూనే.. ప్రాంతాల పేర్ల విషయంలో బీజేపీ సరికొత్త వివాదాలకు తెరలేపుతోంది. ముస్లిం పేర్లున్న ప్రాంతాలను టార్గెట్ చేసుకొని, వాటి పేర్లు మారుస్తూ సంచలనాలకు దారితీస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ ఎక్కడైతే ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందో.. ఆ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల పేర్లను మార్చేసింది. ఇప్పుడు బీజేపీ కన్ను హైదరాబాద్ మీద పడింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరుని మారుస్తామంటూ స్టేట్‌మెంట్లు ఇస్తోంది. ఈ పేరు మార్పునే తన ప్రధాన అస్త్రంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తోంది. తొలుత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఈ అంశాన్ని తెరమీదకి తీసుకురాగా.. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అదే ప్రకటన చేశారు.


హైదరాబాద్‌లోని చార్మినార్ దగ్గర నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ‘భాగ్యనగర్’ అని పేరు పెట్టాలని తాము అనుకుంటున్నామని అన్నారు. ఈ పని చేయడం కష్టమని ప్రస్తుతం అనిపించొచ్చు గానీ, బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం అరగంటలోనే పేరు మార్చేస్తామని కుండబద్దలు కొట్టారు. అప్పుడు ఏ ఒక్కరూ నోరు మెదపలేరని హెచ్చరించారు. ఒకప్పుడు దేశంలో ప్రతిరోజూ ఉగ్రదాడులు జరిగేవని, హైదరాబాద్‌లోనూ జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ చేతిలో అణుబాంబు ఉందని, ఆ దేశంపై దాడి చేస్తే అణుయుద్ధం జరుగుతుందని, అందుకే కాంగ్రెస్‌పై దాడులు జరపకుండా ఐక్యరాజ్యసమితికి వెళ్తామని గతంలో కాంగ్రెస్ చెప్పేదని గుర్తు చేశారు. కానీ.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పాకిస్తాన్ దాడులు జరిపినప్పుడు.. ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్స్‌తో పాటు ఇతర చర్యలు తీసుకున్నారన్నారు. దాంతో భారతదేశం జోలికెళ్తే.. భారీ మూల్యం తప్పదని పాకిస్తాన్ గ్రహించిందని చెప్పారు.

ఇదే సమయంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై హిమంత విరుచుకుపడ్డారు. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడాన్ని ఒవైసీ జీర్ణించుకోలేకపోతున్నారని తనకు ఒకరు చెప్పారన్నారు. ‘‘ఒవైసీ గారు.. మీకు హమాస్‌పై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్‌లో హంగామా చేయొద్దు. మేము పాస్‌పోర్ట్, వీసాలు తయారు చేస్తాము. మీరు గాజాకు వెళ్లి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసన తెలపండి’’ అని పేర్కొన్నారు. అయితే.. పాలస్తీనాకు భారత్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. తాము పాలస్తీనాకు మద్దతు తెలుపుతాం కానీ, హమాస్‌కి కాదని తేల్చి చెప్పారు. హమాస్ అనేది పాలస్తీనా చిహ్నం కాకూడదని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-11-27T15:50:24+05:30 IST