Supreme Court: బలహీనులు ఎన్నికల కమిషనర్లు కాకూడదు
ABN , First Publish Date - 2023-03-03T02:16:15+05:30 IST
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు (ఈసీలు), ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నియామకంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది.
నియమించినవారి పట్ల విధేయులుగా ఉండకూడదు
సీఈసీ, ఈసీల నియామకానికి ప్రధాని, సీజేఐ,
లోక్‌సభలో విపక్ష నేతతో త్రిసభ్య కమిటీ వేయాలి
ఆ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించాలి
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు
పార్లమెంటులో చట్టం చేసే వరకు ఇది అమలులో!
ప్రజాస్వామ్యంలో ఎన్నికల పవిత్రతను కాపాడాలి
కోర్టులు చట్టాలు చేయలేవన్న అపోహ తొలగింది
ఏదైనా అంశంపై చట్టం లేనప్పుడు.. దానిపై కోర్టులు
ఇచ్చే తీర్పునకు శాసనాధికార లక్షణాలు ఉంటాయి
నియంతృత్వ నిరోధానికే అధికారాల విభజన
తీర్పులో సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
అధికారం ఉన్నవారి ఎదుట ధైర్యంగా నిలబడలేని బలహీనులను ఎన్నికల కమిషనర్‌గా నియమించకూడదు. తనను నియమించిన వారికి రుణపడి ఉండాలని భావించే వ్యక్తులకు ఎన్నికల ప్రక్రియలో చోటివ్వకూడదు. విపత్కర సమయాల్లో సైతం.. అధికారంలో ఉన్నవారికి దాస్యం చేయకుండా, బలహీనులను కాపాడ్డానికి ముందుకు వచ్చేలా ఎన్నికల కమిషనర్లు ఉండాలి.
- సుప్రీంకోర్టు
ఎన్నికల కమిషన్ స్వతంత్రతకు ఊతమిచ్చేలా ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా సంచలన తీర్పునిచ్చింది. ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐతో కూడిన త్రిసభ్య కమిటీ సిఫారసు మేరకే కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని తీర్పులో పేర్కొంది. కార్యనిర్వాహక వ్యవస్థ నుంచీ అణచివేతలను ఎదుర్కొంటూ ఎన్నికల ప్రక్రియ అనే బృహత్తర కార్యాన్ని నిర్వర్తించే ఎన్నికల సంఘం చేతుల్లోనే ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల నడుమ ఉన్న అధికారాల విభజనపైనా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ పరిధి మీరి శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలకు పరోక్షంగానే అయినా.. చాలా గట్టిగా జవాబిచ్చింది.
న్యూఢిల్లీ, మార్చి 2: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు (ఈసీలు), ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నియామకంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ప్రధానమంత్రి, లోక్‌సభలో విపక్ష నేత (లేదా) అతి పెద్ద ప్రతిపక్షంగా నిలిచిన పార్టీ నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ సిఫారసుల మేరకు సీఈసీ, ఈసీల నియామకాన్ని రాష్ట్రపతి చేపట్టాలని స్పష్టం చేసింది. వీరి నియామకాలకు సంబంధించి పార్లమెంటులో ఒక చట్టం చేసే దాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని.. లేకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం సీఈసీ, ఈసీల నియామకం రాజ్యాంగంలోని 324వ అధికారణ ప్రకారం జరుగుతోంది. ఈమేరకు కేంద్రం చేసే సిఫారసుల ఆధారంగా వీరిని రాష్ట్రపతి నియమిస్తున్నారు. అయితే.. ఎన్నికల కమిషన్ సభ్యులను నియమించే విషయంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని.. రాజ్యాంగంలోని 342(2) అధికారణకు విరుద్ధంగా ఎన్నికల కమిషనర్లను నియమిస్తున్నారని, వీరి నియామకానికి కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటుచేయాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలో.. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆ పిటిషన్లపై విచారణ జరిపి తీర్పును గురువారం వెలువరించింది.
ప్రజాస్వామ్యంలో అధికారాన్ని పొందే విధానాలు పారదర్శకంగా, రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి ఉండాల్సిందేనని అందులో స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా దుర్వినియోగం చేస్తూ పోతే కాలక్రమంలో అది ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘భాగస్వాములందరూ రాజీ పడకుండా కృషి చేస్తేనే ప్రజస్వామ్యం విజయవంతమవుతుంది. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన అంశం.. పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ. అది ప్రజల మనోభీష్టాన్ని ప్రతిఫలింపజేస్తుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అత్యంత శక్తిమంతమైన తుపాకీ కన్నా.. ఓటు గొప్పదని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ న్యాయబద్ధంగా పనిచేయాలని.. రాజ్యాంగానికి లోబడి ఉండాలని, రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు.. ప్రజాస్వామ్యం భవిష్యత్తు కూడా ఎన్నికల కమిషన్ చేతుల్లోనే ఉందని పేర్కొంది. కాబట్టి.. కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వచ్చే అన్ని రకాల అణచివేతలనూ తట్టుకుంటూ ఉంటూ పోల్ ప్యానెల్ ఈ బృహత్కార్యాన్ని నిర్వహించాలనడంలో ఎలాంటి సందేహమూ లేదని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్‌కు ఆర్థిక మద్దతును నిలిపివేయడం ద్వారా కార్యనిర్వాహక వ్యవస్థ ఈ ప్రకియ్రలో జోక్యం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది.
ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించలేకపోతే.. ప్రజాస్వామ్యానికి పునాది అయిన చట్టబద్ధమైన పాలన దెబ్బతింటుందని ఆందోళన వెలిబుచ్చింది. తమ అడుగులకు మడుగులు ఒత్తే కమిషన్ ద్వారా అధికార పార్టీ నిరంతరం అధికారంలో ఉండాలనుకుంటుందని వ్యాఖ్యానించింది. అధికారాన్ని ఎదుర్కొని నిలబడే ధైర్యం లేని బలహీనులు ఎన్నికల కమిషనర్లు కాకూడదని.. తమను నియమించినవారి పట్ల విధేయులుగా ఉండేవారికీ ఎన్నికల ప్రక్రియలో చోటివ్వకూడదని తేల్చిచెప్పింది. కాగా, ఈ కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును ఇచ్చినప్పటికీ.. జస్టిస్ రస్తోగీ మిగతా నలుగురు న్యాయమూర్తులతో ఏకీభవిస్తూనే, విడిగా 89 పేజీల తీర్పు వెలువరించారు.
మీడియాపైనా..
తీర్పులో రాజ్యాంగ ధర్మాసనం మీడియాపైనా వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల్లో డబ్బు, అధికారం ప్రమేయం పెరిగిపోతోందని.. రాజకీయాలు నేరమయం అవుతున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో మెజారిటీ మీడియా తన పాత్రను విస్మరించడమే కాక, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ఇక, విడిగా తీర్పునిచ్చిన జస్టిస్ రస్తోగీ.. సీఈసీ తొలగింపునకు సంబంధించి ఉన్న రక్షణలే ఎన్నికల కమిషనర్ల తొలగింపునకూ ఉండాలని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ తీర్పపలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల అధికారాల విభజన అంశంపై కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులు చట్టాలను చేయవు, చేయలేవన్న అపోహ చాలాకాలం క్రితమే తొలగిపోయిందని వ్యాఖ్యానించింది. ఏదైనా ఒక అంశంపై నిర్దిష్ట చట్టం ఏదీ లేనప్పుడు.. దానిపై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు శాసనాధికార లక్షణం ఉంటుందని జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. కోర్టులు ఏదైనా చట్టాన్ని లేదా సవరణను రాజ్యాంగవిరుద్ధం అని ప్రకటిస్తే.. అది అధికారాల విభజనను మీరినట్టు కాదని స్పష్టం చేశారు. ‘‘హైకోర్టులైనా, ఈ (సుప్రీం) కోర్టు అయినా.. తమకు ఇచ్చిన అధికారాల మేరకే నిబంధనలు రూపొందిస్తాయి. ఆ సమయంలో కోర్టులు శాసనవ్యవస్థ ప్రతినిధులుగానే వ్యవహరిస్తాయి. ఆయా సందర్భాల్లో కోర్టులు ఉపయోగించే అధికారానికి శాసనాధికార లక్షణమే ఉంటుంది’’ అని ఆయన వివరించారు. ఇదే కోవలో.. రాజ్యాంగంలోని 123వ అధికారణ ప్రకారం కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైనా ఆర్డినెన్స్‌ను రూపొందిస్తే, కార్యనిర్యాహక వ్యవస్థ ఆ సందర్భంలో శాసనాధికారాన్ని ఉపయోగించుకున్నట్టేనని వెల్లడించారు.
అలాగే.. ఎవరైనా ఒక వ్యక్తి సభాహక్కులను ఉల్లంఘించినట్టు పార్లమెంటు భావించినప్పుడు, ఆ వ్యక్తిని పిలిపించి, దోషిగా నిర్ధారించి, శిక్షిస్తే ఆ సమయంలో శాసనవ్యవస్థ న్యాయాధికారాన్ని ఉపయోగించుకున్నట్టుగా భావించాలని పేర్కొన్నారు. భారతదేశంలో అధికారాల విభజనకు సంబంధించి స్పష్టమైన హద్దులు లేవని.. కోర్టులు ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నించకూడదన్న విషయం, చక్రవర్తుల్లాగా వ్యవహరించకూడదన్న విషయం తమకూ తెలుసని స్పష్టం చేశారు. ఒక వ్యవస్థకే ఎక్కువ అధికారాలు ఉన్నాయనే భావనతో నియంతృత్వ పరిస్థితులు ఏర్పడకుండా నిరోధించడానికే అధికారాల విభజన ఉన్నదని తేల్చిచెప్పారు.
ఈడీనీ అలాగే నియమించాలి..
సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అంతేకాదు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ నియామకానికి కూడా అదే ఫార్ములా వర్తింపజేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వి డిమాండ్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని.. దీన్ని అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సిన పాత్రను సుప్రీంకోర్టు గుర్తుచేసిందన్న ఆయన.. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వనరులను మోదీ సర్కారు తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్న తీరుపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, కానీ వాటిపై ఎన్నికల కమిషన్ ఏ చర్యా తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఇక.. దేశ ప్రజస్వామిక విలువలను బలహీనపరచాలన్న బీజేపీ కుట్రలు సఫలం కావని ఈ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిది రణ్‌దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. కాగా.. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడడానికి సుప్రీంకోర్టు తీసుకున్న సరైన చర్యగా దీన్ని సీపీఎం అభివర్ణించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంతీర్పును ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా స్వాగతించారు.
నిపుణుల భిన్నాభిప్రాయాలు..
ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన నిపుణుల్లో మాత్రం ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1996-2001 నడుమ సీఈసీగా వ్యవహరించిన ఎంఎస్ గిల్ ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యానికి మేలు చేసే తీర్పుగా దీన్ని అభివర్ణించారు. మరో మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ కూడా దీన్ని అద్భుతమైన తీర్పుగా కొనియాడారు. ఎలక్షన్ కమిషన్ 20 ఏళ్లుగా దీని కోసమే డిమాండ్ చేస్తోందని.. తనతోసహా చాలామంది సీఈసీలు ఈ మేరకు ప్రభుత్వాలకు లేఖలు రాశారని ఆయన పేర్కొన్నారు. ఈసీగా ఉన్న వ్యక్తి సీనియారిటీ ప్రకారం సీఈసీగా పదోన్నతి పొందేలా వ్యవస్థ ఉండాలని.. తొలగింపు నుంచి సీఈసీకి ఉన్న రక్షణలే మిగతా ఇద్దరు సభ్యులకూ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిపుణుడు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి కూడా కోర్టు తీర్పును స్వాగించారు. అయితే, కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా మాత్రం.. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు చట్టం చేసే ప్రయత్నం చేసిందని, అది పార్లమెంటు పని అని అభిప్రాయపడ్డారు పారదర్శకత కోసమే సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు చెప్పి ఉంటుందని.. అయితే, ఇదే పారదర్శకత జడ్జీల నియామకానికి కూడా వర్తిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో సీఈసీ కూడా ఈ తీర్పును వ్యతిరేకించారు. ‘‘ఇలాగైతే.. జడ్జీలను నియమించే వ్యవస్థకు ప్రధాని నాయకత్వం వహించాలి’’ అని వ్యాఖ్యానించారు.
అమెరికా, బ్రిటన్‌లో ఇలా..
మన దేశంలో ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఇంత చర్చ జరుగుతోంది. మరి అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్‌లో ఈ నియామకాలు ఎలా ఉంటాయి? అంటే..
అమెరికాలో.. మన కేంద్ర ఎన్నికల కమిషన్ తరహాలోని ‘ఫెడరల్ ఎలక్షన్ కమిషన్’ను 1974లో ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఆ కమిషన్‌లోని ఆరుగురు సభ్యులను సెనెట్, ప్రజాప్రతినిధుల సభ, అధ్యక్షుడు కలిసి నియమించేవారు. కానీ, అమెరికా సుప్రీంకోర్టు 1976లో ఈ నియామక ప్రక్రియను రద్దు చేసింది. ఈ ప్రక్రియ ఆఫీసర్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అప్పాయింట్‌మెంట్స్ క్లాజ్ కింద చెల్లదని.. వారిని అధ్యక్షుడే నామినేట్ చేయాలని, సెనెట్ ఆమోదించాలని స్పష్టం చేసింది. ఈమేరకు అమెరికా కాంగ్రెస్ ఫెడరల్ ఎలక్షన్ క్యాంపెయిన్ యాక్ట్‌కు సవరణ చేసింది. ఇప్పుడు అక్కడ ఆరుగురు ఎన్నికల కమిషనర్లను అధ్యక్షుడు నామినేట్ చేస్తుండగా.. సెనెట్ ఆమోదిస్తోంది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్రిటన్‌లో ‘ఎలక్టోరల్ కమిషన్’ ఏర్పాటయింది 2001లో! ‘పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్స్ అండ్ రిఫరెండమ్స్ యాక్ట్ 2000’ ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కమిషనర్లను.. ‘స్పీకర్స్ కమిటీ ఆన్ ద ఎలక్షన్ కమిషన్’ నియమిస్తుంది. ఈ కమిటీ చేసే సిఫారసులను.. ప్రజా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ కామన్స్-మన లోక్‌సభలాంటిది) ఆమోదిస్తుంది. అప్పుడు వారిని రాజు (లేదా) రాణి లాంఛనంగా ఆ పదవిలో నియమిస్తారు.