Share News

NCRB: భారత్‌లో హత్యలకు ప్రధాన కారణమేంటంటే.. ఎన్సీఆర్బీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2023-12-06T11:47:49+05:30 IST

భారత్ లో హత్యలకు ప్రధాన కారణాలుగా పేర్కొంటూ ఎన్సీఆర్బీ నివేదించిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. రెండు వర్గాలు.. లేదా వ్యక్తుల మధ్య ఉన్న వివాదాలే హత్యలకు ఎక్కువగా దారి తీస్తున్నాయని వెల్లడించింది.

NCRB: భారత్‌లో హత్యలకు ప్రధాన కారణమేంటంటే.. ఎన్సీఆర్బీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ఢిల్లీ: భారత్ లో హత్యలకు ప్రధాన కారణాలుగా పేర్కొంటూ ఎన్సీఆర్బీ నివేదించిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. రెండు వర్గాలు.. లేదా వ్యక్తుల మధ్య ఉన్న వివాదాలే హత్యలకు ఎక్కువగా దారి తీస్తున్నాయని వెల్లడించింది. వివాదాల కారణంగా 2022లో జరిగిన హత్యల్లో 9,962 మంది మరణించారని రిపోర్ట్ పేర్కొంది.

మహారాష్ట్రలో అత్యధికంగా 1,130, తమిళనాడు (1,045), బిహార్ (980), మధ్యప్రదేశ్ (726), ఉత్తరప్రదేశ్ (710) వివాదాల కేసులు నమోదయ్యాయి. వివాదాల తర్వాత, 'వ్యక్తిగత పగ లేదా శత్రుత్వం' పెంచుకుని చేసిన హత్యలు రెండో స్థానంలో నిలిచాయి. గతేడాది ఈ తరహా కేసులు 3,761గా ఉన్నాయి. బిహార్ (804), మధ్యప్రదేశ్ (364), కర్ణాటక (353)ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం, వరకట్నం, మంత్రవిద్య, పిల్లల/మానవ బలి, మత, కులతత్వం, రాజకీయ కారణాలు, వర్గ ఘర్షణలు, పరువు హత్యలు, ప్రేమ వ్యవహారాలు కూడా హత్యలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కుటుంబ వివాదాలు, అక్రమ సంబంధాలు, తీవ్రవాదం/తిరుగుబాటు, దోపిడీలు, ముఠా వైరం, ఆస్తి/భూమి తగాదాలు, చిన్న చిన్న తగాదాలు కూడా హత్యలకు కారణమయ్యాయి.


ఉత్తరప్రదేశ్‌లో 2022లో అత్యధికంగా 3,491, బిహార్ లో 2,930, మహారాష్ట్రలో 2,295, మధ్యప్రదేశ్‌లో 1,978 హత్య కేసులు నమోదయ్యాయి. అయితే, 2022లో నమోదైన హత్య కేసుల సంఖ్య 2020, 2021లో నమోదైన వాటికంటే తక్కువగా ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం, 2022లో భారత్‌లో మొత్తం 28,522 హత్య కేసులు నమోదయ్యాయి, సగటున ప్రతిరోజూ 78 హత్యలు లేదా ప్రతి గంటకు మూడు కంటే ఎక్కువ హత్యలు జరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది.

హత్యల సంఖ్య 2021లో 29,272 నుండి 2020లో 29,193కి తగ్గిందని "క్రైమ్ ఇన్ ఇండియా-2022" నివేదిక వెల్లడించింది. 2022లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 3,491 హత్య ఘటన తాలూకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి, ఆ తర్వాతి స్థానాల్లో బిహార్ (2,930), మహారాష్ట్ర (2,295), మధ్యప్రదేశ్ (1,978), రాజస్థాన్ (1,834), పశ్చిమ బెంగాల్ (1,696) ఉన్నట్లు ప్రభుత్వ ఏజెన్సీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. NCRB ప్రకారం, సిక్కిం (9), నాగాలాండ్ (21), మిజోరాం (31), గోవా (44), మణిపూర్ (47)లలో 2022లో హత్య కేసులు తక్కువగా నమోదయ్యాయి.

కేంద్ర పాలిత ప్రాంతాలు, ఢిల్లీలో 2022లో 509 హత్యలు నమోదయ్యాయి, జమ్మూ కశ్మీర్ (99), పుదుచ్చేరి (30), చండీగఢ్ (18), దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ (16), అండమాన్ నికోబార్ దీవులు (7) ), లడఖ్ (5) లక్షద్వీప్ (సున్నా) కేసులు నమోదయ్యాయి. హత్యకు గురైన వారిలో 95.4 శాతం మంది పెద్దలు ఉన్నారు. మొత్తం బాధితుల్లో 8,125 మంది మహిళలు కాగా, పురుషులు 70 శాతం మంది ఉన్నారు. గతేడాది హత్యకు గురైన వారిలో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు.

Updated Date - 2023-12-06T11:48:24+05:30 IST