Gyanvapi Dispute: మసీదే అయితే త్రిశూలం ఎందుకు ఉంటుంది?.. సీఎం సూటిప్రశ్న

ABN , First Publish Date - 2023-07-31T15:11:30+05:30 IST

వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఉండటాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. అది మసీదే అయితే అక్కడ త్రిశూలం ఎందుకుంది? అని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.

Gyanvapi Dispute: మసీదే అయితే త్రిశూలం ఎందుకు ఉంటుంది?.. సీఎం సూటిప్రశ్న

న్యూఢిల్లీ: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు (Gyanvapi Masjid)లో త్రిశూలం (Trishul) ఉండటాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రశ్నించారు. అది మసీదే అయితే అక్కడ త్రిశూలం (Trishul) ఎందుకుంది? అని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. జ్ఞానవాపి ఆవరణ లోపల హిందూ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఒక చారిత్రకమైన తప్పిదం జరిగిందని ముస్లిం వర్గాలు అంగీకరించి ఒక ప్రతిపాదనతో ముందుకు రావాలని సూచించారు. జరిగిన తప్పిదం దిద్దుబాటు జరుగుతుందనే తాము నమ్మతున్నట్టు చెప్పారు.


''జ్ఞానవాపిని మసీదుగా పిలిస్తే, దీనిపై ఒక వివాదం కూడా ఉందని గుర్తించాలి. అదేమిటో చూడాలి. మసీదులో ఒక త్రిశూలంతో పనేంటి? అది మేము పెట్టినది కాదే? అక్కడ ఒక జ్యోతిర్లింగం కూడా ఉంది. దేవతల విగ్రహాలు కూడా ఆలయ ఆవరణలో ఉన్నాయి. ఒక చారిత్రక తప్పిందం జరిగిందనే విషయాన్ని ముస్లిం కమ్యూనిటీ గుర్తించి ఒక ప్రతిపాదనతో ముందుకు రావాలి. తప్పిదం జరిగినప్పుడు దానిని సరిద్దుదుకోవాలి. అది జరుగుతుందనే నమ్మకం మాకు ఉంది'' అని యోగి ఆదిత్యనాథ్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఆగస్టు 3న కీలక తీర్పు చెప్పనున్న నేపథ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. కాశీవిశ్వనాథ ఆలయాన్ని కూల్చి దానిపై జ్ఞానవాపి మసీదు కట్టారని హిందూ వర్గాలు ఆరోపిస్తుండగా, ఈ వాదనతో ముస్లిం కమ్యూనిటీ విభేదిస్తోంది.

Updated Date - 2023-07-31T15:11:30+05:30 IST