Share News

Dr Saveera Parkash: పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ సవీరా ప్రకాశ్.. అసలు ఎవరీమె?

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:40 PM

దాయాది దేశం పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 2024లో జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 3,139 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో ఒకే ఒక్క హిందూ మహిళ ఉంది. ఆమె పేరే సవీరా ప్రకాశ్. 25 ఏళ్ల సవీరా పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించబోతున్నారు.

Dr Saveera Parkash: పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ సవీరా ప్రకాశ్.. అసలు ఎవరీమె?

దాయాది దేశం పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 2024లో 16వ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 3,139 మంది మహిళా అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందులో ఒకే ఒక్క హిందూ మహిళ ఉంది. ఆమె పేరే సవీరా ప్రకాశ్. 25 ఏళ్ల సవీరా పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ మేరకు ఆమె నామినేషన్ కూడా అధికారికంగా దాఖలు చేశారు. బునెర్ జిల్లాలోని పీకే-25 జనరల్ స్థానం నుంచి పీపీపీ (Pakistan peoples party) తరపున ఆమె నామినేషన్ దాఖలు చేశారు.


ఎవరీ సవీరా ప్రకాశ్...

రిటైర్డ్ డాక్టర్, పీపీపీ పార్టీలో 35 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న ఓమ్ ప్రకాశ్ కూతురే సవీరా ప్రకాశ్. అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో 2022లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బునెర్ జిల్లా పీపీపీ ఉమెన్స్ విభాగానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. మహిళల సంక్షేమం కోసం పాటుపడుతానని ఆమె చెబుతున్నారు. మహిళ సంక్షేమం, భద్రత, హక్కుల సాధన కోసం పనిచేస్తానని చెబుతున్నారు.

కాగా సవీరా ప్రకాశ్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ముస్లింల ఆధిపత్యమే ఎక్కువని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. అయితే జాతీయ ఎన్నికల్లో సవీరాను పోటీలో నిలపడం ద్వారా పీపీపీ విప్లవాత్మక అడుగు వేసిందని సోషల్ మీడియాలో పాక్ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. మాజీ ప్రధానులు షెబాజ్ షరీఫ్, ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. మరోవైపు 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కొడుకు హఫీజ్ మహ్మద్ సయీద్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్(పీఎంఎంఎల్) అతడికి మద్దతివ్వనుందని తెలుస్తోంది.

Updated Date - Dec 26 , 2023 | 01:41 PM