Terrorist: డిసెంబర్ 13లోపు పార్లమెంటుపై దాడి చేస్తాం.. కలకలం రేపుతున్న ఉగ్రవాది వీడియో
ABN , First Publish Date - 2023-12-06T09:32:43+05:30 IST
భారత పార్లమెంటుపై(India Parliament) దాడి చేస్తామని బెదిరిస్తూ టెర్రరిస్టు(Terrorist) విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannun) తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.
ఢిల్లీ: భారత పార్లమెంటుపై(India Parliament) దాడి చేస్తామని బెదిరిస్తూ టెర్రరిస్టు(Terrorist) విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannun) తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. అందులో డిసెంబర్ 13లోపు భారత పార్లమెంటుపై దాడి చేస్తామని బెదిరించాడు.
తనను ఇటీవల కొందరు చంపాలని ప్రయత్నించారని వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పాడు. డిసెంబర్ 13, 2001లో పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగింది. దీనిని ఉదహరిస్తూ పార్లమెంటుపై దాడి చేస్తామని బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. పార్లమెంటుపై దాడి చేసి డిసెంబర్ 13తో 22 ఏళ్లు పూర్తవుతాయి. 2001 పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్ గురుని వీడియోలో చూపిస్తూ ఢిల్లీ బనేగా ఖలిస్తాన్(Khalistan Terrorist) అనే శీర్షికతో పోస్టర్ ను ప్రదర్శించాడు.
అందులో ఢిల్లీ ఖలిస్తాన్ గా మారుతుందని అన్నాడు. తనను చంపడానికి భారత ఏజెన్సీలు పని చేశాయని.. వారి కుట్రలు విఫలమయ్యాయని చెప్పాడు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటానని తెలిపాడు. సోమవారం పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ప్రారంభమై డిసెంబర్ 22న ముగుస్తాయి.
సమావేశాల సందర్భంగా పార్లమెంటుపై దాడి చేస్తామని బెదిరించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పన్నూన్ బెదిరింపు వీడియో బయటపడడంతో భద్రతా సంస్థలు సైతం అప్రమత్తమయ్యాయి. పన్నూన్ వెనక పాకిస్థాన్ కి చెందిన ఐఎస్ఐ సంస్థ ఉన్నట్లు భారత అధికారులు భావిస్తున్నారు. అమెరికాలో పన్నూన్ ని చంపడానికి కొందరు ప్రయత్నించారని అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. అతను భారత్ లో నిషేధించిన యూఎస్ ఆధారిత సిక్కుల ఫర్ జస్టిస్(SFJ) చీఫ్ గా ఉన్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు లిస్టులో సైతం ఉన్నాడు.