Operation Kaveri: సూడాన్‌లోని భారత ఎంబసీ సిబ్బందిపై ప్రశంసల వర్షం
ABN , First Publish Date - 2023-04-28T16:37:47+05:30 IST
'ఆపరేషన్ కావేరి' ద్వారా స్వదేశానికి క్షేమంగా తిరిగి వచ్చిన భారతీయుల నుంచి సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిపై..
ముంబై: 'ఆపరేషన్ కావేరి' (Operation Kaveri) ద్వారా స్వదేశానికి క్షేమంగా తిరిగి వచ్చిన భారతీయుల నుంచి సూడాన్ (Sudan) లోని భారత రాయబార కార్యాలయ (Indian Embassy) సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన 600 మంది భారతీయులను ఇంతవరకూ స్వదేశానికి తీసుకువచ్చారు. గురువారం ఒక్కరోజే 246 మంది భారతీయులు క్షేమంగా ముంబై చేరుకున్నారు. వీరిలో పలువురు గత ఏడు రోజులుగా తమకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. ఇదే సమయంలో తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ ప్రతి ఒక్క భారతీయుడిని స్వదేశానికి పంపించేందుకు సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం అవిశ్రాంత సేవలు అందిస్తోందని ప్రశంసించారు.
సూడాన్ రాధాని ఖర్తోమ్‌లో పరిస్థితి విషమించినప్పటి నుంచి భారత రాయబరి బీఎస్ ముబారక్, ఆయన టీమ్‌లోని ఎనిమిది మంది సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని 39 ఏళ్ల అబ్దుల్ కదిర్ అనే వ్యాపారి తెలిపారు. తక్కువ సిబ్బందితో వారు నిరంతర సేవలందిస్తున్నారని చెప్పారు. విషమ పరిస్థితుల్లో సూడాన్‌లో చిక్కుకున్నప్పటి నుంచి తాను ఎంబసీ సిబ్బందితోనూ, వలంటీర్లతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తూ వచ్చానని తెలిపారు. ఇండియన్ అంబాసిడర్ ప్రతి ప్రాంతంలోనూ ఇండియన్లతో వాట్సాప్ గ్రూప్‌లను, ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చూస్తున్నారని 2017 నుంచి సూడాన్‌లోనే ఉంటున్న కదిర్ వివరించారు. రంజాన్ పవిత్ర మాసంలో ఉద్రిక్తతలు తగ్గుతాయని అనుకున్నప్పటికీ ఊహించని విధంగా పరిస్థితులు విషమించాయని తెలిపారు. కేవలం గంట వ్యవధిలో పరిస్థితులు తారుమారయ్యాయని, కనీసం ఆహారం, నిత్యావసరాలు కొనుగోలు చేయలేకపోయామని చెప్పారు. తాము భారతీయులు కావడం కలిసొచ్చిందని, అనేక చెక్‌పాయింట్ల నుంచి సురక్షితంగా తాము బయటకు రాగలమని చెప్పారు.
మాటల్లో చెప్పలేము...
సూడాన్‌లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, అయినప్పటికీ భారత రాయబార కార్యాలయ సిబ్బంది పనితీరు మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉందని మరో ప్రయాణికుడు తెలిపారు. కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రజలు, ఎంబసీలో ఉన్న సాటి సోదరులు సురక్షితంగా ఇళ్లకు చేరాలని భగవంతుని ప్రార్థస్తున్నానని అన్నారు.