Uttarakhand High Court : ఆ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు : హైకోర్టు

ABN , First Publish Date - 2023-07-23T13:34:11+05:30 IST

అత్యాచారం చేసిన దోషిని శిక్షించే చట్టాన్ని ఇటీవలి కాలంలో కొందరు మహిళలు దుర్వినియోగపరుస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్ట్ (Uttarakhand High Court) వ్యాఖ్యానించింది. సహజీవనం చేసిన భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టింది.

Uttarakhand High Court : ఆ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు : హైకోర్టు

న్యూఢిల్లీ : అత్యాచారం చేసిన దోషిని శిక్షించే చట్టాన్ని ఇటీవలి కాలంలో కొందరు మహిళలు దుర్వినియోగపరుస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్ట్ (Uttarakhand High Court) వ్యాఖ్యానించింది. సహజీవనం చేసిన భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టింది. ఇద్దరు వయోజనులు పరస్పరం ఇష్టపడి శారీరక సంబంధం ఏర్పరచుకుంటే, ఆ తర్వాత వీరిలో ఒకరు మరొకరిని పెళ్లి చేసుకోవడానికి తిరస్కరిస్తే, ఆ శారీరక సంబంధం అత్యాచారం నేరం క్రిందకు రాదని సుప్రీంకోర్టు అనేకసార్లు తీర్పు చెప్పిందని గుర్తు చేసింది.

ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరద్ కుమార్ శర్మ జూలై 5న ఇచ్చిన తీర్పులో, ఓ మహిళ దాఖలు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేశారు. ఆమె ఓ పురుషునితో సహజీవనం చేస్తూ, ఆయన పెళ్లి చేసుకోవడానికి తిరస్కరించడంతో, ఆయన తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపిస్తూ ఈ కేసును దాఖలు చేశారు. వీరిద్దరి మధ్య 2005 నుంచి పరస్పర ఇష్టపూర్వక శారీరక సంబంధాలు ఉన్నాయి. ఈరోజుల్లో మహిళలు ఐపీసీ సెక్షన్ 376ను వివిధ కారణాలతో తమ పురుష భాగస్వాములకు వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఫిర్యాదుదారైన మహిళ 2020 జూన్ 30న దాఖలు చేసిన తన పిటిషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఆమెతో 2005 నుంచి పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు ఏర్పరచుకున్నాడు. తమలో ఎవరో ఒకరికి ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుందామని వీరిద్దరూ ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ నిందితుడు వేరొక మహిళను పెళ్లి చేసుకుని, ఫిర్యాదుదారుతో కూడా సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

హైకోర్టు స్పందిస్తూ, నిందితునికి పెళ్లి జరిగిన విషయం తెలిసిన తర్వాత కూడా ఫిర్యాదుదారు అతనితో స్వచ్ఛందంగా సంబంధాన్ని కొనసాగిస్తున్నపుడు, సమ్మతి అంశం తనంతట తానే రంగంలోకి వస్తుందని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన హామీలో ఎంత వరకు నిజాయితీ ఉందనే అంశాన్ని ఇరువురూ పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకునే ముందే నిర్థరించుకోవాలని, ఆ తరువాత దశలో కాదని తెలిపింది. ఫిర్యాదుదారు, నిందితుని మధ్య సంబంధాలు 15 సంవత్సరాలపాటు కొనసాగాయని, అంతేకాకుండా నిందితునికి పెళ్లి జరిగిన తర్వాత కూడా కొనసాగాయని గుర్తు చేసింది. ఈ పరిస్థితిలో ప్రారంభ దశను పరిగణనలోనికి తీసుకోలేమని చెప్పింది.

ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల

Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్‌ వెళ్లిపోతున్న మెయిటీలు..

Updated Date - 2023-07-23T13:34:11+05:30 IST