Parliament : ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు?.. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ సంకేతాలు..
ABN , First Publish Date - 2023-09-05T11:27:58+05:30 IST
ఈ నెల 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప రాష్ట్రపతి జగదీప్ సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దీనికి సంబంధించిన సంకేతాలను పంపించారు.
న్యూఢిల్లీ : ఈ నెల 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ (Vice President Jagdeep Dhankhar) సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దీనికి సంబంధించిన సంకేతాలను పంపించారు. పార్లమెంటు, శాసన సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే, 2047 కన్నా ముందే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో సోమవారం జరిగిన విశ్వవిద్యాలయ మహారాణి మహావిద్యాలయ కార్యక్రమంలో విద్యార్థినులను ఉద్దేశించి జగదీప్ ధన్‌కర్ మాట్లాడుతూ, తగిన రాజ్యాంగ సవరణల ద్వారా భారత దేశంలో పార్లమెంటు, శాసన సభల్లో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లభించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. 2047నాటికి మన దేశం అంతర్జాతీయ స్థాయిలో గొప్ప శక్తిగా ఎదుగుతుందన్నారు. అయితే ఈ రిజర్వేషన్ త్వరగా అమల్లోకి వస్తే, 2047 కన్నా ముందుగానే మనం నంబర్ వన్ స్థానానికి చేరుకుంటామని చెప్పారు. పంచాయతీలు, నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లను మన రాజ్యాంగం కల్పిస్తోందన్నారు. ఈ రిజర్వేషన్ చాలా ముఖ్యమైనదని తెలిపారు.
రాజ్యాంగంలో చైర్మన్ అనే పదం ఉందని, ఇది స్త్రీ, పురుషులకు వర్తించే పదం కాదని అన్నారు. తాను ఉప రాష్ట్రపతిని అయినందువల్ల రాజ్యసభకు చైర్మన్ పదవిని నిర్వహిస్తున్నానని చెప్పారు. ఈ పదవిని మహిళలు కూడా చేపట్టవచ్చునన్నారు. కానీ రాజ్యాంగం మాత్రం చైర్మన్ అని చెబుతోందన్నారు. ఈ పద్ధతిని తాను మార్చానని చెప్పారు. పానెల్‌లో ఎవరైనా పురుషుడిని లేదా మహిళను నియమిస్తే, ఆ వ్యక్తి రాజ్యసభ చైర్మన్ స్థానంలో కూర్చుని, సభను నిర్వహిస్తే, మనం ఆ వ్యక్తిని చైర్మన్ అని పిలవబోమని, పానెల్ ఆఫ్ వైస్ చైర్‌పర్సన్ అని పిలుస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి :
Teachers’ Day : ఉపాధ్యాయులకు వందనం : మోదీ
BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్... ఆమె ఏమన్నారో తెలిస్తే...