Women's Reservation Bill: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి
ABN , First Publish Date - 2023-09-19T15:18:54+05:30 IST
చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా పార్లమెంటు నూతన భవనంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సెప్టెంబర్ 20వ తేదీన చర్చ జరుగుతుంది.
న్యూఢిల్లీ: చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation)ను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా పార్లమెంటు నూతన భవనంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సెప్టెంబర్ 20వ తేదీన చర్చ జరుగుతుంది. ఆ వెంటనే ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలుపనున్నారు. అనంతరం రాజ్యసభలో సెప్టెంబర్ 21న బిల్లును ప్రవేశపెడతారు. ఉభయ సభల్లో బిల్లుకు ఆమోదం తెలిపడంతో చట్టంగా రూపొందుతుంది. చట్టం అమలులోకి వస్తే లోక్‌సభలో మహిళల సంఖ్య 181 స్థానాలకు పెరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభలో 81 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. నారీ శక్తి వందన్ అధినియమ్ (Nari Shakti Vandan Adhiniyam) పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతూ, మహిళా సాధికారతకు ఈ బిల్లు ఉద్దేశించినదని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AAను సవరించడం ద్వారా ఢిల్లీ నేషనల్ టెరిటరీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందన్నారు. ఈ బిల్లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మహిళలకు విస్తృత ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాధించడంలో మహిళల పాత్ర కీలకమన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టగానే రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని, ఇది 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని అన్నారు. ప్రతి డీలిమిటేషన్ ఎక్సర్‌సైజ్ తర్వాత మహిళలకు రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని చెప్పారు. బిల్లు చట్టంగా మారితే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.