Robot Lawyer : ప్రపంచంలో తొలి రోబో న్యాయవాది సేవలు వచ్చే నెలలో ప్రారంభం

ABN , First Publish Date - 2023-01-25T15:43:25+05:30 IST

కృత్రిమ మేధా శక్తి (Artificial Intelligence) అన్ని రంగాల్లోకీ దూసుకొస్తోంది. ట్రాఫిక్ చలానాకు సంబంధించిన ఓ కేసును వచ్చే నెలలో

Robot Lawyer : ప్రపంచంలో తొలి రోబో న్యాయవాది సేవలు వచ్చే నెలలో ప్రారంభం
Robot Lawyer

న్యూఢిల్లీ : కృత్రిమ మేధా శక్తి (Artificial Intelligence) అన్ని రంగాల్లోకీ దూసుకొస్తోంది. ట్రాఫిక్ చలానాకు సంబంధించిన ఓ కేసును వచ్చే నెలలో ఓ రోబో న్యాయవాది చేపట్టబోతోంది. ప్రపంచంలో మొట్టమొదటి రోబో న్యాయవాది ఇదే కావడం విశేషం. డూనాట్‌పే (DoNotPay) అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబో న్యాయవాదిని సృష్టించింది.

జోషువా బ్రౌడర్ (Joshua Browder) 2015లో డూనాట్‌పే అనే లీగల్ సర్వీసెస్ చాట్‌బాట్‌ను స్థాపించారు. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్‌ను సృష్టించినట్లు ప్రకటించారు. రుసుముల చెల్లింపు ఆలస్యమవడం, జరిమానాల విధింపు వంటి కేసుల్లో ఈ రోబో లాయర్ న్యాయ సలహాలు ఇస్తుందని తెలిపారు. కేసు గురించి దీనికి శిక్షణ ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. రోబో న్యాయవాది సహాయపడే కేసు విచారణ ఫిబ్రవరిలో జరుగుతుందని చెప్పారు.

అయితే ఈ కేసు విచారణ ఎప్పుడు, ఎక్కడ, ఏ కోర్టులో జరుగుతుందో ఈ కంపెనీ వెల్లడించలేదు. ప్రతివాది పేరును కూడా బయటపెట్టలేదు. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపినందుకు చలానా విధించిన కేసులో ప్రతివాదికి ఈ రోబో న్యాయవాది సలహాలు ఇస్తుంది. ఈ రోబో స్మార్ట్‌ఫోన్‌ ద్వారా చెప్పిన విషయాలను మాత్రమే ప్రతివాది కోర్టుకు చెబుతారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ పత్రిక ‘న్యూ సైంటిస్ట్’ తెలిపిన వివరాల ప్రకారం, కోర్టులో తాను విన్న సమాచారాన్ని ఈ రోబో న్యాయవాది ప్రాసెస్ చేసి, విశ్లేషించుకుంటుంది. అనంతరం ఏ విధంగా స్పందించాలో ప్రతివాదికి చెప్తుంది. కేసులో ఓడిపోతే అందుకు జరిగిన నష్టాన్ని భరించేందుకు డూనాట్‌పే కంపెనీ అంగీకరించింది.

Updated Date - 2023-01-25T15:43:30+05:30 IST