Wrestlers protest: రెజర్ల 5 డిమాండ్లు.. 15 వరకూ వేచిచూడమన్న కేంద్రం
ABN , First Publish Date - 2023-06-07T19:19:24+05:30 IST
రెజ్లర్లు చేపట్టిన ఆందోళన బుధవారంనాడు మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు రెజర్లు బజ్రంగ్ పూనియా , సాక్షి మాలిక్ సుమారు ఆరు గంటల సేపు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. 5 డిమాండ్లతో కూడిన లిఖిత పూర్వక ప్రతిపాదనను మంత్రికి రెజ్లర్లు సమర్పించగా, ఈనెల 15వ తేదీతో దర్యాప్తు పూర్తవుతుందని, అంతవరకూ వేచిచూడాలని మంత్రి రెజ్లర్లను కోరారు.
న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ సింగ్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన (Wrestlers protest) బుధవారంనాడు మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anuraga Thakur) ఆహ్వానం మేరకు రెజర్లు బజ్రంగ్ పూనియా (Bhajran punia), సాక్షి మాలిక్ (Sakshi Malik) సుమారు ఆరు గంటల సేపు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. 5 డిమాండ్లతో కూడిన లిఖిత పూర్వక ప్రతిపాదనను మంత్రికి రెజ్లర్లు సమర్పించినట్టు తెలుస్తోంది. కాగా, ఈనెల 15వ తేదీతో దర్యాప్తు పూర్తవుతుందని, అంతవరకూ వేచిచూడాలని కేంద్రం రెజ్లర్లను కోరింది.
బజ్రంగ్ పూనియా ఏం చెప్పారంటే..?
కేంద్ర మంత్రితో సమావేశానంతరం రెజ్లర్ బజ్రంగ్ పూనియా మాట్లాడుతూ, పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించామని, పోలీసు విచారణ జూన్ 15తో పూర్తవుతుందని, అంతవరకూ ఎలాంటి నిరసన చేపట్టవద్దని మంత్రి కోరారని చెప్పారు. మహిళా రెజ్లర్ల భద్రతను తాము చూసుకుంటామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. తాము సైతం రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని కోరామని, అందుకు మంత్రి అంగీకరించారని చెప్పారు.
15న దర్యాప్తు పూర్తి, 30న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు
కాగా, రెజ్లర్లతో సమావేశానంతరం మీడియాతో మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఆరు గంటల సేపు సుదీర్ఘంగా రెజ్లర్లతో తాను చర్చలు జరిపినట్టు చెప్పారు. ఈనెల 15వ తేదీ కల్లా దర్యాప్తు పూర్తవుతుందని, చార్జిషీటు సమర్పిస్తారని తాను రెజ్లర్లకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు ఈనెల 30న జరుపుతామని మంత్రి తెలిపారు.
రెజర్ల డిమాండ్లివే..
కాగా, జాతీయ మీడియా కథనాల ప్రకారం, మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలని, సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులకు చోటు కల్పించరాదని, రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాలక మండలికి ఎన్నికలు నిర్వహించాలని, జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతల కారణంగా తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.