XBB.1.5 : భారత్‌లో ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్‌

ABN , First Publish Date - 2023-01-01T02:51:04+05:30 IST

అమెరికాను వణికిస్తున్న.. అక్కడ రోజువారీ పాజిటివ్‌ల సంఖ్య భారీ పెరుగుదలకు కారణమవుతున్న.. కొవిడ్‌ ఒమైక్రాన్‌ ఉప వేరియంట్‌ ఎక్స్‌బీబీ.1.5 తొలి

XBB.1.5 : భారత్‌లో ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్‌
XBB.1.5 variant

డిసెంబరులో గుజరాత్‌కు చెందిన వ్యక్తిలో గుర్తింపు

అమెరికాలో కేసుల ఉధృతికి ఈ వేరియంటే కారణం

పుణె, డిసెంబరు 31: అమెరికాను వణికిస్తున్న.. అక్కడ రోజువారీ పాజిటివ్‌ల సంఖ్య భారీ పెరుగుదలకు కారణమవుతున్న.. కొవిడ్‌ ఒమైక్రాన్‌ ఉప వేరియంట్‌ ఎక్స్‌బీబీ.1.5 తొలి కేసు భారత్‌లోనూ నమోదైంది. గుజరాత్‌కు చెందిన వ్యక్తి డిసెంబరులోనే ఈ వేరియంట్‌ బారినపడినట్లు ఇన్సాకాగ్‌ డేటా స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగునున్న మహారాష్ట్ర అప్రమత్తమైంది. పాజిటివ్‌ వచ్చినవారందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపనున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌బీబీ.1.5. ఒమైక్రాన్‌ రకానికి చెందిన రెండు వేర్వేరు బీఏ.2 ఉప వేరియంట్ల రీకాంబినెంట్‌. అయితే, ఇతర ఉప వేరియంట్ల కంటే వ్యాప్తి వేగం ఎక్కువ. ఏస్‌2 రిసెప్టర్లను గట్టిగా అతుక్కుని, రోగ నిరోధకతను ఏమార్చే సామర్థ్యం అధికంగా కలిగి ఉంటుంది. అంతేగాక అదనపు ఉత్పరివర్తనాలు వస్తుండడంతో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఎక్స్‌బీబీ.1.5ను సూపర్‌ వేరియంట్‌గా అభివర్ణిస్తూ ప్రధానంగా దృష్టిసారించారు. మరోవైపు ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్లతో అమెరికాలో వారం వ్యవధిలో కేసులు 44.1 శాతం పెరిగాయి. ఇక న్యూయార్క్‌లో నమోదవుతున్న కేసుల్లో అధికం ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్‌వే. కాగా, కొవిడ్‌ తీవ్రత రీత్యా చైనా (హాంకాంగ్‌తో కలిపి), జపాన్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా నుంచి వచ్చేవారు 72 గంటల ముందుగా చేయించుకున్న పరీక్ష తాలూకు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం తప్పనిసరి’’ నిబంధన ఆదివారం నుంచి అమల్లోకి రానుంది.

Updated Date - 2023-01-01T02:51:05+05:30 IST