Rabbit : ఆకాశం రాలిపడింది!
ABN , First Publish Date - 2023-03-28T22:32:41+05:30 IST
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ పిరికి, భయస్తురాలైన కుందేలుండేది. మెరుపు మెరిసినా, వాన వచ్చినా, గాండ్రింపులు వినపడినా.. పక్షుల కూతలు గట్టిగా వినపడినా భయపడేది.
కథ
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ పిరికి, భయస్తురాలైన కుందేలుండేది. మెరుపు మెరిసినా, వాన వచ్చినా, గాండ్రింపులు వినపడినా.. పక్షుల కూతలు గట్టిగా వినపడినా భయపడేది. ఒళ్లంతా చెమటలు పట్టేది. దాని స్వభావం అందరికీ తెలుసు. అయితే కుందేలు మనస్తత్వం మంచిదని మిగతా జంతువులు సర్దుకుపోయేవి. కుందేలుకు ధైర్యం నూరిపోసేవి. కొన్నాళ్ల తర్వాత కుందేలుకి బయటనుంచి తెచ్చుకున్న ధైర్యం వచ్చింది. తానూ ధైర్యం ప్రదర్శించాలనుకుంది. అయినా తనకి తగిన లక్షణం కూడా కాదని తెలిసి గంభీరంగా ఉండటానికి ప్రయత్నించేది.
అసలే వేసవికాలం. మామిడిచెట్టు కింద మామిడిపండు తిని నిద్రపోయింది. పండిన మామిడిపండు వచ్చి కుందేలు నడ్డి మీద పడింది. కుందేలు బిత్తరపోయింది. ఆకాశం విరిగి తలమీద పడుతోందనే భ్రమ వచ్చింది. బతుకు జీవుడా.. అని పరిగెత్తింది. కొంచెం పరిగెత్తుతూనే జింక ఎదురైంది. ‘ఆకాశం పైనుంచి..’ అంటూ తడబడుతూ పరిగెత్తుతోంది. ఏదో పెద్ద విషయమే జరిగిందని జింక పరిగెత్తింది బిత్తరపోయి. మిగతా జింకలు వీటి వెనకాల పరిగెత్తుతున్నాయి. అలా జిరాఫీలు, కంచరగాడిదలు, కోతులు.. అన్నీ ‘ఆకాశం మీద నుంచి..’ అంటూ పరిగెత్తుతున్నాయి. ఎవరికీ ఏ విషయం తెలీదు. నిజమైన సమాచారం తెలీదు. అయినా పరిగెత్తుతున్నాయి. గుహలో పడుకుని అడవికి రాజైన సింహం నిద్రపోతోంది. అడవిలోని చప్పుడు విని బయటకు వచ్చింది. జంతువులన్నీ వేగంగా పరిగెత్తుతున్నాయి. మట్టిపెళ్లలు, రాళ్లు, చెట్టకొమ్మలు తగులుతూ చప్పుళ్లు వినపడుతున్నాయి.
‘ఎందుకు మీరంతా పరిగెత్తుతున్నారు? మిమ్మలను తరుముతున్నారా? ఎవరైనా’ అని అడిగింది సింహం. అందరూ ఏమో అంటున్నారు. అయితే ఎవరూ చెప్పటం లేదు. సింహం గట్టిగా నవ్వింది. ‘ఎవరు చూశారు.. ఆ ఆకాశం మీద పడింది’ అంటూ గట్టిగా అరిచాడు. ‘నేను చూశాను మహారాజా’ అంటూ కుందేలు ముందుకు వచ్చింది. ‘ఏదీ చూపించు..’ అని కేవలం ధైర్యంగా ఉండే పులి, ఖడ్గమృగము లాంటి జంతువులను మాత్రమే వెంట తీసుకుని ఆ చోటుకు వెళ్లింది. ‘ఇక్కడే ఆకాశం మీద నుంచి విరిగి పడింది’ అన్నది కుందేలు. ‘ఆకాశం మీదనుంచి మామిడిపండు పడింది. మామిడిపండు పడితే ఆకాశంలో ముక్క విరిగినట్లేనా?’ అంటూ కోపంగా అర్చింది. ఆ క్షణంలో కుందేలు తలెత్తుకోలేకపోయింది. ఇతర జంతువులను చూడటానికి సిగ్గుపడింది. ‘క్షమించండి’ అంటూ మిత్రులందరినీ వేడుకుంది.