Story : తెలివైన పిచ్చోడు
ABN , Publish Date - Dec 14 , 2023 | 05:16 AM
ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉన్నాడు. అతను ఒంటరిగా తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉండేవాడు. అయితే అతన్ని పిచ్చోడిగా ఆ ఊరి జనాలు లెక్కగట్టారు. పి
ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉన్నాడు. అతను ఒంటరిగా తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉండేవాడు. అయితే అతన్ని పిచ్చోడిగా ఆ ఊరి జనాలు లెక్కగట్టారు. పిచ్చోడు అంటే కోపం వచ్చేది అతనికి. అయితే అతను చేసిన పనులు అందరికీ కొత్తగా ఉండేవి. ఒక్కోసారి అతడికి పిచ్చి కంటే తెలివి ఉందని కొందరు మేధావులు అనేవారు. ఏదేమైనా రంగయ్యతో సూక్ష్మమైన పనులు తెలిసేవి.
ఒక రోజు రంగయ్య ఓ సభ దగ్గరకు వెళ్లాడు. అక్కడ విపరీతమైన గుంపు. దేవుని గురించి ఏవేమో మాటలు మాట్లాడారు. దేవుడు.. నాలో ఉన్నాడు.. మీలో ఉన్నాడు.. అంటన్నాడు ఆ సభలోని పెద్ద. ఆ తర్వాత ప్రశ్నలు అడగమన్నారు. ‘నాలో దేవుడిని చూపించు?’ అన్నాడు రంగయ్య. అందరూ గమ్మున ఉండిపోయారు.
ఒక రోజు రంగయ్య ఇంటి నుంచి పొలానికి వెళ్తున్నాడు. దారిలో కొన్ని పండ్లను తిన్నాడు. రుచికరంగా ఉన్నాయని పాటలు పాడుకుంటూ వస్తున్నాడు. ఓ పిల్లకాలువలో పండితుడు ఒకరు ఉన్నారు. ఆయన దైవమాటలు మాట్లాడుతున్నాడు. రంగయ్య ఆగాడు. పిచ్చోడు ఇలా ఆగాడేంటని అనుకున్నాడు పండితుడు. మెల్లగా పండితుడి దగ్గరకు వెళ్లి.. అయ్యా.. అంటూ గట్టిగా పిలిచాడు. పండితుడు కళ్లు మూసుకున్నట్లు నటించాడు. నీళ్లలోకి దిగాడు రంగయ్య. ఇక మాట్లాడకుండా కష్టం అనుకున్నాడు పండితుడు. ‘అయ్యా.. ’ అన్నాడు రంగయ్య. చెప్పండయ్యా... అన్నాడు కోపంతో పండితుడు. ఏమి చేస్తున్నారు? అనడిగాడు రంగయ్య. సూర్యునికి అర్థ్యం ఇస్తున్నానన్నాడు పండితుడు. ‘అవునా?’ అన్నాడు రంగయ్య. నీటిలోపలకి ఆ పిచ్చివాడనే రంగయ్య వచ్చాడు. దీంతో పండితుడు కాస్త పక్కన నిలబడ్డాడు. ఏమి రంగయ్య? నీ వాలకం అన్నాడు. ఏమీ లేదు... అంటూ నీళ్లు చేతులతో వేశాడు రంగయ్య. ‘ఇదేంటీ?’ అన్నాడు పండితుడు. ‘కాస్త తగ్గులో మా చేను ఉంది. అందుకే నీళ్లు చల్లుతున్నా అన్నాడు రంగయ్య. ‘అవునా.. ఆ నీళ్లు చేలోకి వెళ్లవు.. నీ పిచ్చి కానీ’ అంటూ ముగించేశాడు పండితుడు. ‘మీరు లక్షల కిలోమీటర్ల దూరం ఉన్న సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే వెళ్తుంది. నేను మాచేనులోకి నీళ్లు పోస్తే పోవా?’ అనడిగాడు రంగయ్య. ‘ఈ పిచ్చోడు భలే ఉన్నాడే. కొంపదీసి వీడికి సైన్సు ఇష్టమేమో. వీడో మేధావి అయి ఉండచ్చు. అసలు వీడిని పిచ్చివాడు అనటం బాలేదు’ అని మనసులో అనుకుంటూ పండితుడు తుర్రుమన్నాడు అక్కడనుంచి.