Cheating fox: మోసకారి నక్క !
ABN , First Publish Date - 2023-03-02T23:16:21+05:30 IST
ఒక అడవిలో కుందేలు ఉండేది. ఆ అడవికి దగ్గరలోని ఒక గ్రామంలో పిల్లి ఉండేది. అడవిలో కుందేలు హాయిగా ఆడుకునేది. దుంపలు తినేది.
కథ
ఒక అడవిలో కుందేలు ఉండేది. ఆ అడవికి దగ్గరలోని ఒక గ్రామంలో పిల్లి ఉండేది. అడవిలో కుందేలు హాయిగా ఆడుకునేది. దుంపలు తినేది. హాయిగా జీవించేది. ఊరిలోని పిల్లి కూడా అంతే. బలిష్టమైన ఎలుకలను పట్టుకుని తింటూ ఆనందంగా గడిపేది. బొరియల వెంట తిరుగుతూ మరీ ఎలుకలను వేటాడేది.
ఒక రోజు పిల్లికి ఎవరో పొరుగింటి వాళ్లు ‘అడవి ఎలుకలైతే రుచికరంగా ఉంటాయ’న్నారంతే. ఆ రోజు నుంచి పిల్లికి అడవి ఎలుకల తిండిపైనే పడింది. ఒక రోజు ఒక్క ఎలుక కూడా దొరకలేదు. దీంతో దగ్గరలో ఉండే ఓ నీటి గుంటలో నీళ్లు తాగి అడవివైపు పయనించింది. అడవిలో ఎలుకలను వెతుక్కుంటూ వెళ్లింది. ఎలుకలు దొరకలేదు. ఒక పెద్ద బొరియ కనిపించింది. అందులోకి వెళ్లింది. అది చల్లగా ఉండటంతో, పైగా ఆ బొరియలో గడ్డి ఉండటంతో అనుకోకుండా నిద్రలోకి జారుకుంది. సాయంత్రం అయ్యాక కుందేలు తన ఇంటికి వచ్చింది. బొరియలో చూస్తే పిల్లి నిద్రపోతోంది. కుందేలుకు కోపం వచ్చింది.. గట్టిగా అరిచింది. నిద్రలోంచి పిల్లి ఉలిక్కిపడింది.
‘ఇది నా ఇల్లు’ అన్నది కుందేలు. ‘ఇది నా ఇల్లు. నీ పేరు ఉందా?’ అన్నది కుందేలు. ఇద్దరూ వాదులాడారు. కొట్లాడారు. చివరికి ఏమి చేసేది లేక పంచాయితీకోసం ఎవరైనా కలవాలనుకున్నారు. ఆ సమయంలో కోతిబావ అందుబాటులో లేదు. ఎవరో చెబితే నక్క దగ్గరకు వెళ్లాయి. ఆ మాటలన్నీ నక్క వినింది. మీ ఇంటిని చూపించమని చెప్పింది. కుందేలు, పిల్లి వెంటనే అటువైపు తీసుకెళ్లాయి. బొరియలోకి కుందేలు వేగంగా వెళ్లింది. వెంటనే పిల్లి వెళ్లింది. వాటి వెనకాల నక్క వెళ్లింది. ఆ రెండింటినీ బయటికి రానీయకుండా అక్కడే తినేసింది.