మోసం చేస్తే పతనం తప్పదు!
ABN , First Publish Date - 2023-09-14T23:21:53+05:30 IST
పూర్వకాలంలో ఒక అడవిలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది. ఈ చెట్టు మీద కొన్ని వందల పక్షులు ఉండేవి. ఆ పక్షులకు ఒక రాణి ఉండేది.
పూర్వకాలంలో ఒక అడవిలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది. ఈ చెట్టు మీద కొన్ని వందల పక్షులు ఉండేవి. ఆ పక్షులకు ఒక రాణి ఉండేది. పక్షులన్నీ ఉదయాన్నే లేచి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లి ఆహారాన్ని తీసుకువచ్చేవి. ఆ ఆహారాన్ని పక్షి రాణి అందరికీ పంచేది. ఒక రోజు ఒక పక్షి అడవికి సమీపంలో ఉన్న గ్రామం నుంచి కొన్ని బళ్లలో ధ్యానాన్ని తీసుకువెళ్లటం చూసింది. అందులో కొంత ధాన్యం రోడ్డు మీద పడిపోయి ఉంది. వెంటనే వెళ్లి చెట్టు మీద పక్షులకు ఆ విషయం చెప్పాలనుకొంది. కానీ ఆ పక్షికి ఆ ధాన్యమంతా తానే తినాలనే ఆశపుట్టింది. మిగిలిన పక్షులు ఆ ప్రదేశానికి వెళ్లకుండా చేయటానికి ఒక కుట్ర పన్నింది.
పక్షి రాణి దగ్గరకు వెళ్లి- ‘‘రాణి! నేను అడవి చివర ఉన్న గ్రామ సమీపంలో కొన్ని బళ్లను చూశాను. వాటి నుంచి ధాన్యం పడుతోంది. కానీ ఆఽ ధాన్యం కోసం వెళ్తే- బళ్ల చక్రాల క్రింద పడి మరణిస్తాం. అందువల్ల ఎవ్వరినీ ఆ గ్రామం వైపు వెళ్లవద్దని చెప్పండి’’ అని వినయంగా కోరింది. పక్షి రాణి వెంటనే పక్షులన్నింటినీ సమావేశపరచి- ఆ గ్రామం వైపు ఎవ్వరూ వెళ్లవద్దని ఆజ్ఞాపించింది. దాంతో పక్షులు ఆ గ్రామం వైపు వెళ్లటం మానేసాయి. కానీ ధాన్యాన్ని ముందుగా చూసిన పక్షి- ప్రతి రోజూ అక్కడకు వెళ్లి కొంత ధాన్యం తినేది. ఇలా తిని తిని ఆ పక్షి బాగా లావ్వెక్కిపోయింది. కదలలేని పరిస్థితికి చేరుకుంది. ఆ పక్షి ఒక రోజు ధాన్యం తింటూ- దగ్గరగా వచ్చిన బండిని గమనించలేదు. త్వరగా ఎగరలేకపోవటంతో బండి చక్రం కింద పడి మరణించింది.
(ఇతరులను మోసగించేవారికి ఎప్పటికైనా పతనం తప్పదు- ఈ విషయాన్ని చెప్పే పంచతంత్ర కథ ఇది)