TS Election: నవతరం ప్రతినిధులు... మార్పు సారథులు
ABN , First Publish Date - 2023-11-27T01:39:11+05:30 IST
పదవుల నిచ్చెన పైకిపోయే కొద్దీ అధికార పదవుల్లో మహిళల సంఖ్య తగ్గుతుంది’ అన్న ఒక స్త్రీవాద ప్రముఖురాలి మాట అక్షర సత్యమే
నిరుద్యోగ సమస్య అజెండాతో ఒకరు... ప్రజలకు, పాలకులకు మధ్య అగాథాన్ని పూరించాలని మరొకరు.. చట్టసభల్లో భిన్నస్వరాన్ని వినిపించాలని ఇంకొకరు... ఇలా జెండాలు ఏవైనా... తమవైన విభిన్న అజెండాలతో కొందరు మహిళలు మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. వీరందరూ ఉన్నత విద్యావంతులు. ఎక్కువమంది 35 ఏళ్ల లోపు వారే! ‘‘అధికారం కోసం మా అదృష్టాన్ని పరీక్షించుకోవడం కాదు, ప్రజల దురదృష్టాన్ని పారదోలడమే మా లక్ష్యం. జనం ఆదరిస్తే సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా పాలన అందిస్తాం’’ అంటూ ప్రజాస్వామ్యం మీద కొత్త ఆశలు రేకెత్తిస్తున్న ఆ మహిళా అభ్యర్థులల్లో కొందరిని ‘నవ్య’ పలకరించింది.
‘పదవుల నిచ్చెన పైకిపోయే కొద్దీ అధికార పదవుల్లో మహిళల సంఖ్య తగ్గుతుంది’ అన్న ఒక స్త్రీవాద ప్రముఖురాలి మాట అక్షర సత్యమే! మరి ఈ పరిస్థితి మారేదెన్నడు? దీన్ని మార్చేదెవ్వరు? మహిళా బిల్లుకు మద్దతు పలికిన మూడు ప్రధాన పార్టీలు ఆచరణలో మాత్రం అవకాశవాదాన్ని ప్రదర్శించాయి. మ్యానిఫెస్టోలలో మాత్రం ‘సౌభాగ్యలక్ష్మి’, ‘మహాలక్ష్మి’, ‘ఉజ్వల’ లాంటి రకరకాల పథకాలతో అతివల ప్రాథాన్యత కల్పిస్తున్నామంటూ ఊరిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం కాదు కదా... అందులో కనీసం సగభాగం సీట్లు కూడా కేటాయించలేదు. మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళల సంఖ్య 33 మాత్రమే! అయినా, సూర్యకాంతిని అరచేతితో అడ్డుకోలేనట్టుగా తెలంగాణలో మొత్తం 221 మంది మహిళలు ఈ ఎన్నికల బరిలోకి దిగారు. వారంతా గెలుపోటములతో పనిలేకుండా ప్రజాస్వామ్యం పట్ల తమకున్న అవ్యాజమైన ప్రేమతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి... ప్రచారంలో తమదైన శైలితో దూసుకెళుతున్నారు.
భిన్న నేపథ్యాలు... విభిన్న స్వరాలు
ప్రత్యర్థుల మీద వ్యక్తిగత విమర్శలు సంధించడం, సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధాలు ప్రచారం చేయడం, మద్దతుదారులను బెదిరించడం... ప్రతి ఎన్నికలోనూ ఇవే పెడపోకడలు. దీనికి భిన్నంగా... తమకు ఓటు వేస్తే, శక్తియుక్తులను పణంగా పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని కొందరు మహిళా అభ్యర్థులు వాగ్దానం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రజల్లోకి వెళుతున్నారు. శాసనసభకు పోటీ అంటే కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారంగా భావిస్తున్న ఈ రోజుల్లో... రాజకీయాలను భూమార్గం పట్టించిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క దీనికి ఒక ఉదాహరణ. ఇవాళ దేశమంతా కొల్లపూర్ నియోకవర్గం వైపే చూస్తోంది. అలానే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి రంగంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి పుష్పిత లయ ఈ ఎన్నికల బరిలోకి దిగిన ఒకే ఒక ట్రాన్స్ మహిళ. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ‘సోషలిస్టు యూనిటీసెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు’ పార్టీ అభ్యర్థి కె.జ్యోతి కూడా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో కార్పొరేట్ల జోక్యాన్ని తగ్గించి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే తన ఉద్దేశమని ఆమె వివరిస్తున్నారు. ఇలా ప్రలోభాల సంస్కృతికి అతీతంగా... ప్రభావశీల రాజకీయాలకు పునాదులు నిర్మిస్తున్న మహిళా అభ్యర్థులు మరికొందరు కనిపిస్తున్నారు.
ఉన్నత విద్యావంతులే అధికం...
సామాజిక మార్పు కోసం తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్న మహిళా అభ్యర్థుల్లో చాలామంది ఉన్నత విద్యావంతులే. పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష ఐఐటియన్. సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి తన వంతు సేవ చేయాలనుకొన్న 27 ఏళ్ల ఆమె కరోనా సమయంలో గ్రామీణ పరిస్థితులను చూసి రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించుకొన్నారు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి 26 ఏళ్ల యశస్వినీ రెడ్డి ఇంజనీరింగ్ చదివారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి నేతతో తలపడుతున్నారు. సనత్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ ఢిల్లీ వర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. సుదీర్ఘకాలం జాతీయ మీడియాలో పాత్రికేయురాలిగా పనిచేసిన నీలిమ... మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పోటీ పడుతున్నారు. మరొక సీనియర్ జర్నలిస్టు రాణి రుద్రమరెడ్డి బీజేపీ అభ్యర్థిగా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌కు పోటీగా నిలవడం ఒక సంచలనం.
రాజకీయ నేపథ్యం కొందరికే...
స్థానిక సంస్థల్లో ప్రజల మన్ననలు అందుకొని... ఇప్పుడు శాసనసభకు పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులూ కొందరున్నారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సేవలందించిన భోగా శ్రావణి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరపతయ్య గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా చేశారు. ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు ప్రత్యర్థిగా నిలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి కూడా జిల్లాపరిషత్ వైస్-ఛైర్‌పర్సన్ బాధ్యతలు నిర్వర్తించారు. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్యనందిని... జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా గెలిచారు. వీరంతా స్థానిక సంస్థల్లో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. నారాయణపేట కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తెగా లాస్యనందినికీ, పీజేఆర్ కుమార్తెగా ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికీ కుటుంబ రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ... తమదైన ముద్రతో ప్రజాక్షేత్రంలో రాణిస్తున్నారు.. ప్రజాయుద్ధ నౌకగా జన హృదయాల్లో నిలిచిన గద్దర్ కుమార్తె వెన్నెల కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. తండ్రి ఆకాంక్ష నెరవేర్చడానికే ఎన్నికల రంగంలోకి వచ్చానని ఆమె చెబుతున్నారు.
అభివృద్ధి అజెండా ప్రధానంగా...
ప్రలోభాలు, పోల్ మేనేజ్‌మెంట్ లాంటి వాటికన్నా అభివృద్ధి సూత్రాలను ఆ నవతరం మహిళా అభ్యరులు బలంగా నమ్ముతున్నట్లు వారి మాటల ద్వారా స్పష్టమవుతోంది. స్థానిక సమస్యలపై తమకు అవగాహన ఉందనీ, కేవలం పార్టీల మ్యానిఫెస్టోల ప్రచారానికి పరిమితం కాకుండా, నియోజకవర్గానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పాటుపడతామని హామీ ఇస్తున్నారు. కళాశాలలు, ఆసుపత్రుల ఏర్పాటు, మహిళలకు ఉపాఽధి, వ్యవసాయాభివృద్ధి, స్థానికంగా పరిశ్రమల ఏర్పాటు, చేతి వృత్తులకు ప్రోత్సాహం లాంటి అనేక అంశాలు వాళ్ల అజెండాలో చోటు చేసుకున్నాయి. కక్షపూరిత రాజకీయాలకు తాము దూరమనీ, తమను గెలిపిస్తే... పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని కూడా మాట ఇస్తున్నారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తాము ఎల్లప్పుడూ జనంతోనే ఉంటామని నవతరం నేతలు చెబుతున్నారు. వీరు రాజకీయాలకు కొత్తయినా... జనం బాగానే స్వాగతిస్తున్నారు. ‘వీళ్లనూ ఒకసారి నమ్మి చూద్దాం’ అని ఆలోచిస్తున్నవారూ ఎక్కువే ఉన్నట్టు సంకేతాలూ కనిపిస్తున్నాయి. ఇవీఎం మీట నొక్కేటప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారో మరి.
వారి మనసు గెలిస్తేనే....
తాజాగా జరిగిన ఛత్తీ్‌సగఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఎక్కుమంది మహిళలేనంటూ వార్తలు వచ్చాయి. మొత్తంగా 1.55 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, వారిలో 78.12 లక్షలమంది మహిళలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ 76.03 శాతం మంది మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మిజోరాంలోనూ ఇదే తీరును గమనించవచ్చు. ఇక ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న తెలంగాణలో మహిళా ఓటర్లు 1,63,01,705. కాగా పురుష ఓటర్లు 1,62, 98, 418. అంతేకాదు... 74 నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లే అధికమని తాజా ఓటర్ జాబితాలు చెబుతున్నాయి. అంటే, పార్టీల భవితవ్యం మహిళల చేతిలో ఉందన్నమాట.
మహిళా ప్రాతినిధ్యం 15 శాతం లోపే...
2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులతో సహా మొత్తం 127 మంది మహిళలు పోటీలో నిలిచారు. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు 39 మంది కాగా తొమ్మిదిమందే గెలిచారు. 2018లో 136 మంది పోటీ పడగా ఆరుగురు ఎన్నికయ్యారు. 1952లో జరిగిన హైదరాబాద్ రాష్ట్ర తొలి ఎన్నికలు మొదలుకొని, తరువాత ఉమ్మడి రాష్ట్రం... ప్రస్తుత తెలంగాణ వరకూ శాసనసభలో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 15 శాతం దాటలేదు. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 221మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో మూడు ప్రధాన పార్టీల్లో బిజెపి-జనసేన కూటమి 14 మందికి, కాంగ్రెస్ 11మందికి, బిఆర్‌ఎస్ 8 మందికి... మొత్తంగా 33 మందికి టిక్కెట్లు ఇచ్చాయి.
స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తా...
- డాక్టర్ బోగా శ్రావణి, జగిత్యాల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి.
జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్థానికులకు నేను పరిచయమే. పట్టణాభివృద్ధికి నేను చేసిన కృషిని వారంతా కళ్లారా చూశారు. ముఖ్యంగా కరోనా సమయంలో మూడు నెలల బిడ్డను ఇంట్లో వదిలి, స్థానికుల ఆరోగ్యం కోసం పనిచేసిన సంగతి వారికి తెలుసు. కనుక ప్రజాదరణకు లోటు లేదు. కాకపోతే, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల నుంచి బెదిరింపులు లాంటివి ఎదురవుతున్నాయి. నా సభలకు వెళ్లవద్దని జనాన్ని బెదిరిస్తున్నారు. నా పుట్టింటివారు, అత్తింటివారు చాలా ఏళ్లు స్థానిక రాజకీయాల్లో రాణించారు. వారి ప్రోత్సాహంతో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగాను. డాక్టరుగా కన్నా... ప్రజా నాయకురాలిగా వీలైనంత ఎక్కువమందికి సేవ చేయవచ్చనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. జగిత్యాలకు పరిశ్రమలు తీసుకురావడం. మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు. బీడీ, గల్ఫ్ కార్మికుల సంక్షేమం లాంటి కార్యక్రమాలు చేపట్టి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించాలని ప్రజలను కోరుతున్నాను. నేను గెలిస్తే స్థానిక సంస్థలను బలోపేతం చేసి, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను.
ఆ ఆశయ సాధన కోసం...
డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, నారాయణపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి.
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలిగా, వెంకటరెడ్డి కూతురిగా రాజకీయాల్లోకి వచ్చాను. వారిద్దరూ నన్ను వైద్యురాలిగా చూడాలనుకొన్నారు. జనం కోసం ప్రాణాలు అర్పించిన మా తాతయ్య, నాన్న ఆశయాలను కొనసాగించాలనుకుంటున్నాను. ప్రస్తుతం రేడియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. జీవో 69 అమలు, కోటకొండ, గార్లపాడు, కనుకుర్తి మండలాల ఏర్పాటు... ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలతో పాటు... మా నియోజకవర్గంలో చేనేతను మరింతగా ప్రోత్సహించడం, నారాయణపేటలో మహిళా డిగ్రీ కళాశాల, మరికల్‌లో జూనియర్ కళాశాలల ఏర్పాటు... ఇవీ నా ప్రాధాన్యతలు. ప్రచారంలో భాగంగా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అనేక సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. వాటన్నిటినీ పరిష్కరిస్తాను. నా భర్త యూరాలజిస్టు. మేమిద్దరం వైద్యులుగా నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం కూడా కృషి చేస్తాం.
ప్రజల ఆహ్వానంతోనే ఎన్నికల్లోకి వచ్చా
- మామిడాల యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి.
దేవుడి దయవల్ల మాకు సంపదకు లోటు లేదు. కాబట్టి రాజకీయాల్లోకి పూర్తిగా ప్రజా సేవ చేయడానికే వచ్చాం. నలభై ఏళ్లుగా స్థానికులకు సహాయంగా రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా అత్తమ్మ ఝాన్సీరెడ్డిని పాలకుర్తి ప్రజలే రాజకీయాల్లోకి ఆహ్వానించారు. కొన్ని కారణాల వల్ల అత్తమ్మ పోటీ చేయలేకపోవడంతో నేను ముందుకు వచ్చాను. ఉన్నత విద్యావంతురాలిగా నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేది నా సంకల్పం. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించి తర్వాత పత్తాలేకుండా పోయే నాయకుల్లా కాకుండా... ‘ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసమే పనిచేయాలి’ అనే నిర్ణయంతోనే పోటీలోకి దిగాను. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందనివ్వకపోవడం, అక్రమ కేసులు పెట్టడం, బెదిరించడం లాంటి కాలం చెల్లిన రాజకీయాలకు అన్ని పార్టీలూ స్వస్తి పలకాలి. కొత్తతరం ప్రతినిధిగా నూతన రాజకీయాలను పరిచయం చేయానేది నా ఆకాంక్ష.
పాలకులు కాదు, సేవకులు కావాలి
- కోట నీలిమ, సనత్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యరి.్థ
రాజనీతిశాస్త్ర పరిశోధకురాలిగా ‘పాలకులు’ అనే పదాన్ని నేను అంగీకరించను. రాజకీయాలంటేనే ప్రజాసేవ. అందులో ప్రజా సేవకులు మాత్రమే ఉండాలి. ప్రజలకు ప్రజాసేవకులకు మధ్య ఏర్పడిన అగాధాన్ని తగ్గించాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఇప్పుడే ఎక్కడినుంచో ఊడిపడి, ప్రజల దగ్గరకు వెళ్లి ‘నాకు ఓటు వెయ్యండి’ అని అడగడం లేదు. నాలుగేళ్లుగా సనత్‌నగర్, సికింద్రాబాద్ ప్రాంతాలలో నా స్వచ్ఛంద సంస్థ ద్వారా స్థానిక సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నాను. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీదా నాకు అవగాహన ఉంది. సనత్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి పది గ్యారంటీ సూత్రాలను రూపొందించాను. దాన్ని ప్రజల ముందు ఉంచి, ఓట్లు అడుగుతున్నాను. నేను గెలిస్తే... నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను. పూర్తి సమయం నియోజకవర్గం అభివృద్ధికి వెచ్చిస్తాను. ‘నా విద్యార్హతలతో పాటు సమాజం పట్ల నాకున్న నిబద్ధతను చూసి గెలిపించండి’ అని ప్రజలను కోరుతున్నాను.
సామాన్యుల అవస్థలు తీర్చాలని...
- బడే నాగజ్యోతి,
ములుగు నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి.
నా చిన్నతనంలో ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎమ్మార్వో ఆఫీసుకు వెళితే పది రోజులు తిప్పించుకొన్నారు. అప్పుడే అనుకొన్నాను... ‘రాజకీయాల్లోకి వెళ్లాలి. నాలాంటి సామాన్యులకు ఈ అవస్థలు తగ్గించాలి’ అని. నన్ను మా కాల్వపల్లి గ్రామ ప్రజలు రాజకీయ రంగంలోకి తీసుకొచ్చారు. వారి ఆశీస్సులతో జిల్లాపరిషత్ వైస్-ఛైర్‌పర్సన్ స్థాయి వరకుఎదిగాను. ఇప్పుడు మొదటిసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నాను. నాకు మా ప్రాంత సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది. పప్పు ధాన్యాలు ఎక్కువగా పండే మా ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడం ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. రామప్ప, లక్నవరం, బొగత లాంటి జలపాతాలతో నెలవైన అందమైన మా ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తాడ్వాయిలో అటవీ కళాశాల, ఏటూరు నాగారంలో పీజీ కళాశాలల ఏర్పాటు, కొత్తగూడ - గంగారంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం లాంటి అంశాలతో కూడిన ప్రధాన అజెండాతో ప్రజలను ఓట్లు అడుగుతున్నాను.’’
ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికే దుష్ప్రచారం
- కర్నె శిరీష (బర్రెలక్క), కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి.
నా ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి, కొందరు నా వ్యక్తిగత జీవితం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా నేను భయపడను. మా నాన్న తాగి కన్నకూతురు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నాడు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. నిరుద్యోగ సమస్య అజెండాగా ప్రజల్లోకి వచ్చాను. నా పోరాటం కొనసాగిస్తాను. ప్రజలు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటాను. కొల్లాపూర్ నియోజకవవర్గ ప్రజలు నన్ను గెలిపిస్తే, ఆ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాను. గెలిచిన తర్వాత కూడా హైదరాబాద్ లాంటి నగరాల్లో కాకుండా, నా సొంతూరు పెద్దకొత్త పల్లిలోనే ఉంటాను. స్థానికులకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తాను. ప్రజాసేవ కొనసాగిస్తాను.
అవే ప్రధాన లక్ష్యాలు
- పుష్పిత లయ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి.
మాది వరంగల్ పట్టణంలోని రామన్నపేట. నాలుగేళ్లుగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. నేను కొన్నాళ్లు ఢిల్లీలో ఉన్నాను. ఆ సమయంలో బీఎస్పీ విధానాలు నన్ను అమితంగా ఆకట్టుకోవడంతో ఆ పార్టీలో చేరాను. రాష్ట్రంలో ఇన్ని రాజకీయ పార్టీలుండగా, కేవలం ఒక్క బీఎస్పీ మాత్రమే ట్రాన్స్‌కమ్యూనిటీకి చెందిన నన్ను పోటీలో నిలబెట్టింది. నేను రామన్నపేట అంబేడ్కర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షురాలిగా ప్రజా పోరాటాల్లో పాల్గొన్నాను. మహిళల మీద అకృత్యాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాడుతున్నాను. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందేలా చూడడం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో అవినీతి, అవకతవకలను రూపుమాపడం నా ప్రధాన లక్ష్యాలు. మా నియోజకవర్గ ప్రజలు నన్ను బాగా ఆదరిస్తున్నారు. ప్రచారంలో మాకు అల్పాహారం, భోజనాలు లాంటి సౌకర్యాలు స్థానికులే ఏర్పాటుచేస్తున్నారు. కొందరు విరాళాలు ఇస్తున్నారు. నాకు ఇంత పెద్దఎత్తున మద్దతు లభిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
-సాంత్వన్