NRI: రెండు కాళ్లూ లేవు.. జీవితాంతం కుర్చీకే పరిమితం.. అయినా రూ.21 లక్షలు ఎలా సంపాదిస్తోందంటే..

ABN , First Publish Date - 2023-02-11T20:44:31+05:30 IST

రెండు కాళ్లూ లేకపోయినా ఉత్సాహంగా అభివృద్ధివైపు దూసుకుపోతున్న ఈ అమెరికా మహిళ ఎందరికో ఆదర్శం

NRI: రెండు కాళ్లూ లేవు.. జీవితాంతం కుర్చీకే పరిమితం.. అయినా రూ.21 లక్షలు ఎలా సంపాదిస్తోందంటే..

ఎన్నారై డెస్క్: ఆరోగ్యకరమైన శరీరం..తెలివితేటలు ఉండి కూడా జీవితాన్ని వృథా చేసుకునేవారు కొందరు. మరికొందరు మాత్రం జీవితం విలువైనదనే ఎరుకతో తమ శక్తికొలది అభివృద్ధి దిశగా పయనిస్తుంటారు. అమెరికా(USA) టియారా సిమన్స్ జీవితం తరచి చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఆమెకు రెండు కాళ్లై లేవు(Amputee). జీవితాంతం కుర్చీకే పరిమితం. అయితే.. మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తున్న ఆమె తన అవసరాలకు సరిపడా సంపాదిస్తున్నారు.

కాలిఫోర్నియాకు(California) చెందిన టియారా సిమన్స్(Tiara simmons) ప్రస్తుతం ఏడాదికి 26 వేల డాలర్లు సంపాదిస్తోంది. అమెరికా పరిస్థితుల ప్రకారం ఇదో మోస్తరు ఆదాయం. టియారా లీగల్ క్లర్క్‌గా పనిచేస్తుంటుంది. ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా మార్కెటింగ్ నిపుణురాలిగా తనకు చేతనైనంత మేర డబ్బు సంపాదిస్తుంటుంది. ఆమెకు మూడేళ్ల కూతురు ఉంది. భర్త కూడా చిన్న ఉద్యోగే. బిడ్డను బాలల సంరక్షణాలయానికి పంపిస్తే డబ్బు ఎక్కువ ఖర్చవుతుందనే ఉద్దేశ్యంతో భార్యాభర్తలిద్దరూ వంతుల వారీగా బిడ్డ బాధ్యతను పంచుకుంటారు. ప్రభుత్వ సాయం ద్వారా ఆహారం, ఇతరత్రా ఖర్చులు తీర్చుకోగలుగుతున్నారు.

తనకు వైకల్యం ఉన్నప్పటికీ జీవితంలో ఎన్నడూ వికలాంగురాలినన్న భావం కలగలేదని టియారా చెప్పారు. చిన్నతనం నుంచే తనకు భవిష్యత్తుపై బోలెడన్నీ ఆశలు, కలలు ఉండేవని అన్నారు. కాలేజీలోకి అడుగుపెట్టాక కొంత మేర వివక్ష ఎదుర్కొన్నట్టు తెలిపారు. ఇటీవల ఆమె లాయర్ కూడా అయ్యారు. పేదలకు న్యాయం అందేలా చేయడమే తన జీవిత లక్ష్యమని ఆమె వెల్లడించారు. ‘‘ప్రస్తుతం నా వద్ద డబ్బు లేదు.. భవిష్యత్తులో కట్టలకు కట్టలు సంపాదిస్తాననీ అనుకోవట్లేదు. అయితే.. జీవితంలో నాకు నచ్చి పని చేసుకునే అవకాశం ఉన్నంత కాలం నేను హ్యాపీగానే ఉంటా’’ అంటూ ఆమె తన లైఫ్ ఫిలాసఫీని చెప్పారు.

Updated Date - 2023-02-11T20:44:32+05:30 IST