చైనాతో ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉంది: భారత సంతతి అమెరికా నేత వ్యాఖ్య

ABN , First Publish Date - 2023-03-05T21:30:32+05:30 IST

చైనా కారణంగా మరో ప్రజారోగ్యపరమైన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఇప్పటికీ ఉందని భారత సంతతికి(Indian Origin) చెందిన అమెరికా నేత వివేక్ రామస్వామి తాజాగా హెచ్చరించారు.

చైనాతో ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉంది: భారత సంతతి అమెరికా నేత వ్యాఖ్య

ఎన్నారై డెస్క్: చైనా(China) కారణంగా మరో ప్రజారోగ్యపరమైన సంక్షోభం తలెత్తే ప్రమాదం(Pandemic Risk) ఇప్పటికీ ఉందని భారత సంతతికి(Indian Origin) చెందిన అమెరికా నేత వివేక్ రామస్వామి(Republican Vivek Ramaswamy) తాజాగా హెచ్చరించారు. కరోనా సంక్షోభం కారణాలను వెలికితీయడంలో ఆమెరికా ప్రభుత్వం నిరాసక్తత ప్రదర్శిస్తోందని విమర్శించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇక రిపబ్లికన్ ప్రైమరీల్లో విజేతగా నిలిచి పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టిన వారే పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు అర్హత సాధిస్తారు.

చైనాతో పొంచి ఉన్న ప్రమాదం గురించి వివేక్ రామస్వామి ఇటీవల ట్వీట్ చేశారు. ‘‘వెంటనే చర్యలు తీసుకోకపోతే.. భవిష్యత్తులో మరింత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు’’ అని వ్యాఖ్యానించారు. చైనాతో ప్రమాదం పొంచి ఉందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్‌ పత్రికలో ప్రచురితమైన వ్యాసాన్ని కూడా ఆయన షేర్ చేశారు.

రామస్వామి 2014లో రాయవాంట్ సైన్సెస్ అనే బయోటెక్ సంస్థను స్థాపించారు. ఆ తరువాత ఓ హెడ్జ్ ఫండ్‌లో భాగస్వామి అయ్యారు. అంతేకాకుండా... పలు పుస్తకాలను కూడా రచించారు. ఇదిలా ఉంటే.. రిపబ్లికన్ పార్టీ తరఫున ఇప్పటికే పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump), మరో భారత సంతతి నేత నిక్కీ హేలీ(Nikky Haley) అధ్యక్ష ఎన్నికల్లో పార్టీకి ప్రాతినిధ్యం వహించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. త్వరలో జరగనున్న పార్టీ ప్రైమరీల్లో(Party Primary) విజేతలు ఎవరో తేలనుంది.

Updated Date - 2023-03-05T21:30:32+05:30 IST