NRI: విమాన ప్రమాదం ఈ నవ్వును మాయం చేసింది.. అమెరికాలో భారత సంతతి మహిళ దుర్మరణం..!
ABN , First Publish Date - 2023-03-07T18:43:07+05:30 IST
అమెరికాలో జరిగిన ఓ విమానప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ దుర్మరణం చెందారు.
ఎన్నారై డెస్క్: అమెరికాలో జరిగిన ఓ విమానప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ(Indian Origin woman) దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలపాలైన ఆమె కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం ఓ తేలికపాటి శిక్షణ విమానంలో మంటల్లో చిక్కుకుని నేల కూలింది(Plane Crash). ఆ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న రోమా గుప్తా(63) దుర్మరణం చెందారు. ఆమె కూతురు రీవా గుప్తాకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదానికి గురైన విమానాన్ని డెన్నీ వైజ్‌మన్ ఫ్లైట్ స్కూల్‌కు చెందినదిగా గుర్తించారు. తన కూతురు రీవాతో కలిసి రోమా విమానంలో లాంగ్ ఐలాండ్(Long Island) నుంచి బయలుదేరారు. ఇంతలో విమానంలో పొగలు వ్యాపించాయి. పైలట్ వెంటనే ఈ విషయాన్ని గ్రౌండ్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు తిరుగొస్తుండగా మంటల్లో చిక్కుకున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో రీవాతో పాటూ పైలట్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి. నేలకూలిన విమానంలో చిక్కుకున్న వారి ఓ పౌరుడు గుర్తించి కాపాడాడు. రెవా.. మౌంట్ సినాయ్ సిస్టమ్స్‌లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. డెనీ వైజ్‌మస్ స్కూల్ ఈ ఘటనపై స్పందించింది. విమానం ఇటీవలే రెండు పూర్తిస్థాయి తనిఖీలు పూర్తి చేసుకుందని పేర్కొంది. పైలట్‌కు కూడా శిక్షణ ఇవ్వడంలో మంచి అనుభవం ఉందని చెప్పింది. రోమా రేవాల కోసం సంస్థ డెమాన్‌స్ట్రేషన్ ఫ్లైట్ నిర్వహించన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. విమాన నడపడం నేర్చుకోవాలనుకునే వారి కోసం ఇలాంటి విమాన ప్రయాణాలు నిర్వహిస్తామని సంస్థ పేర్కొంది. అయితే..ప్రమాదంలో పడిన విమానం పర్యటనల కోసం ఉద్దేశించినదని స్థానిక పోలీసులు చెబుతున్నారు.