Family Visas: ఒమన్ కీలక నిర్ణయం.. ఇకపై ప్రవాసులు తమ ఫ్యామిలీలను సుల్తానేట్‌కు తీసుకెళ్లడం చాలా ఈజీ!
ABN , First Publish Date - 2023-02-21T10:44:49+05:30 IST
అరబ్ దేశం ఒమన్ ప్రవాసులకు (Expatriates) పండగలాంటి వార్త చెప్పింది.
మస్కట్: అరబ్ దేశం ఒమన్ ప్రవాసులకు (Expatriates) పండగలాంటి వార్త చెప్పింది. ఫ్యామిలీ వీసాల వేతన పరిమితిని సగానికి పైగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ (Royal Oman Police) ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కుటుంబ వీసాల వేతన పరిమితిని 50 శాతానికి పైగా తగ్గించాలని ఆర్ఓపీ (ROP) తీసుకున్న నిర్ణయాన్ని సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని ప్రవాస కార్మికులు స్వాగతిస్తున్నారు. ఇక తాజా నిర్ణయంతో 150 ఒమనీ రియాళ్ల (రూ.32,249) కంటే ఎక్కువ సంపాదిస్తున్న ప్రవాసులు తమ ఫ్యామిలీని ఒమన్‌కు తీసుకురావడానికి అనుమతి ఉంటుందని ఈ సందర్భంగా ఆర్ఓపీ స్పష్టం చేసింది.
ఇక ఇప్పటివరకు వలస కార్మికులు తమ కుటుంబాన్ని సుల్తానేట్‌కు తీసుకురావడానికి కనీస నెలవారీ వేతనం ఓఎంఆర్ 350గా (రూ.75,248) ఉంది. ఇప్పుడు దీన్ని సగానికిపైగా తగ్గించడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 'ఫ్యామిలీ జాయినింగ్ వీసా' కోసం కనీస నెలవారీ ఆదాయ నియమాన్ని ఒమన్ 2011లో ప్రవేశపెట్టిన విషయం విదితమే. అలాగే 2017లో ప్రభుత్వం డిపెండెంట్ వీసాకు (Dependent Visa) అర్హత పొందేందుకు అవసరమై ఓఎంఆర్ 600 (రూ.1,28,997) నుంచి ఓఎంఆర్ 350కి (రూ.75,248) తగ్గించింది. ఇదిలాఉంటే.. తాజాగా ఫ్యామిలీ వీసాల వేతన పరిమితిని తగ్గిస్తూ సుల్తానేట్ తీసుకున్న నిర్ణయంపై అక్కడ ఉంటున్న భారతీయ ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న తాము ఈ నిర్ణయంతో ఫ్యామిలీలను ఒమన్‌కు తీసుకురావడం సులువు అయిందని కే బెనోయి అనే భారత ప్రవాసుడు అన్నాడు.
ఇది కూడా చదవండి: అనుకుంది సాధించిన కువైత్.. ఆ శాఖలో ఒక్క ప్రవాస ఉద్యోగి కూడా లేకుండా చేసేసింది!