NRI: ఈ టార్చర్ భరించలేను.. నన్ను ఏ క్షణమైనా ఇండియాకు పంపేయచ్చు.. కన్నీరు పెట్టిస్తున్న బ్రిటన్ ఎన్నారై దీన గాథ..

ABN , First Publish Date - 2023-02-12T21:11:15+05:30 IST

బ్రిటన్ రాణి ప్రశంసలు పొందిన భారతీయుడిని దేశం నుంచి పంపిచేయాలంటూ కోర్టు తీర్పు.. అసలేం జరిగిందంటే..

NRI: ఈ టార్చర్ భరించలేను.. నన్ను ఏ క్షణమైనా ఇండియాకు పంపేయచ్చు.. కన్నీరు పెట్టిస్తున్న బ్రిటన్ ఎన్నారై దీన గాథ..

ఎన్నారై డెస్క్: ఆయన ఏకంగా బ్రిటన్ రాణి(Britain Queen) ప్రశంసలు పొందారు. కొవిడ్ సమయంలో ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఉచితంగా ఆహారం సరఫరా చేసి అందరిముందూ హీరోగా నిలిచారు. ‘‘మీ సేవలకు ధన్యవాదాలు’’ అంటూ స్వయంగా రాణి లేఖ రాశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బ్రిటన్ వీడాల్సిన దుస్థితిలో పడిపోయారు. కోర్టులో తొమ్మిదేళ్ల పాటు జరిగిన న్యాయపోరాటంలో ఓడిపోయారు. ఇటీవలే అతడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ ఎడతెగని టార్చర్ భరించలేకుండా ఉన్నా..రాత్రుళ్లు నిద్ర కూడా పట్టట్లేదు అంటూ ఆ ఎన్నారై స్థానిక మీడియా ముందు వాపోయారు.

నలభైరెండేళ్ల విమల్ పాండ్యా(Vimal Pandya) 2011లో పైచదువుల కోసం బ్రిటన్(Britain) వెళ్లారు. కానీ..మూడేళ్ల తరువాత ఆయన చదువుకుంటున్న కళాశాల లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయం పాండ్యాకు తెలియదు. ఈ క్రమంలోనే ఆయన 2013లో భారత్‌కు వచ్చారు. తన బంధువును చికిత్స కోసం భారత్‌కు తీసుకొచ్చారు. ఆ తరువాత మళ్లీ బ్రిటన్‌కు వెళ్లాక ఆయనకు జరిగిన విషయం తెలిసింది. దీంతో.. ఆయన బ్రిటన్ ఉండే హక్కు కోల్పోయారు.

నాటి నుంచి ఆయన వీసా కోసం చట్టబద్ధంగా పోరాడుతూనే ఉన్నారు. దక్షిణ లండన్‌లోని Rotherithe ప్రాంతంలో నివసిస్తున్న పాండ్యా.. కరోనా టైంలోనూ స్థానికులకు అండగా నిలిచారు. ఏకంగా బ్రిటన్ రాణితో శభాష్ అనిపించుకున్నారు. అదే సమయంలో అలుపెరగని న్యాయపోరాటం చేస్తూ బోలెడంత డబ్బులు ఖర్చు చేశారు. కానీ.. పాండ్యా ఆశించిన ఉపశమనం మాత్రం దక్కలేదు. ‘‘రాత్రుళ్లు నిద్ర కూడా పట్టట్లేదు. వాళ్లు నన్ను ఏ క్షణమైన దేశం నుంచి పంపించేయచ్చు. ఇది భయానక పరిస్థితి’’ అంటూ స్థానిక మీడియా వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు.

జనవరి 24న స్థానిక న్యాయస్థానం పాండ్యాకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ‘‘ఈ కేసులో అన్ని అంశాలను మేము పరిశీలించాం. పిటిషనర్ తన సామాజిక జీవనంలో ఎన్నో విజయాలు సాధించారు. అయితే.. వలసల విధాన్ని సామాజిక శ్రేయస్సు కోణంలో పరిశీలిస్తే ఆయనకు దేశంలో కొనసాగేందుకు అర్హత లేదు’’ అంటూ న్యాయమూర్తి పాండ్యా అప్పీల్‌ను తోసిపుచ్చారు. ఈ తీర్పును సవాల్ చేసేందుకు పాండ్యాకు గరిష్టంగా 28 రోజుల వ్యవధి ఉంది. అక్కడా చుక్కెదురైతే.. బ్రిటన్ హోం శాఖ ఆయనను దేశం నుంచి పంపించేస్తుంది(Deportation). మరోవైపు..స్థానికులు అనేక మంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన వీసా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆన్‌లైన్‌లో క్యాంపెయిన్ ప్రారంభించారు. దీనికి మద్దతుగా ఇప్పటివరకూ 1.75 లక్షల సంతకాలు సేకరించారు.

Updated Date - 2023-02-12T21:55:10+05:30 IST