NRI: ఒకే ఒక్క ఘటన.. నడిరోడ్డున పడ్డ కుటుంబం.. కొడుకు కోసం వెళ్లి ఈ ఎన్నారై ఎలా మరణించాడంటే..
ABN , First Publish Date - 2023-02-07T21:11:41+05:30 IST
విధి వక్రించడంతో ఓ ఎన్నారై కుటుంబం ఒక్కసారిగా తలకిందులైంది. రోడ్డు ప్రమాదంలో కుటుంబపెద్దను కోల్పోయిన రోడ్డున పడింది.
ఎన్నారై డెస్క్: విధి వక్రించడంతో ఓ ఎన్నారై(NRI) కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. రోడ్డు ప్రమాదంలో(Accident) కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డున పడింది. మృతుడి అంత్యక్రియల కోసం ప్రస్తుతం గో ఫండ్ మీ పేజ్ ద్వారా విరాళాల సేకరణ జరుగుతోంది. పెన్సిల్వేనియాలోని(Pennsylvania) డాఫిన్ కౌంటీకి చెందిన ప్రీతీష్ పటేల్ జనవరి 27న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ ఆయన హర్షే మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతూ జనవరి 30న మృతి చెందారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద ప్రతీష్ ఈ-బైక్‌పై రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ లైట్ ఉన్నట్టు సమాచారం.
మధుమేహం వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడికి ఇన్సూలిన్ కోసం బయటకు వెళ్లిన ప్రీతీష్ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తున్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. దశాబ్ద కాలం పాటూ లాంకాస్టర్‌లో నివసించిన ఆయన ఇటీవలే డాఫిన్ కౌంటీకి మారినట్టు ఆయన బంధువు ఎలిజబెత్ పిలుకెయిటిస్ మీడియాతో తెలిపారు. కాగా.. ప్రీతీష్ కిడ్నీలను డొనేట్ చేసేందుకు బాధిత కుటుంబం ముందుకొచ్చింది. ప్రీతీష్ సంపాదన ఒక్కటే ఆ కుటుంబానికి ఆధారం కావడంతో..అంత్యక్రియలు కోసం బంధువులు, కుటుంబ సభ్యులు గో ఫండ్ మీ పేజ్ ద్వారా విరాళ సేకరణ నిర్వహిస్తున్నారు. ప్రీతీష్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.