ఆస్ట్రేలియాలో మహిళలపై భారతీయుడి అరాచకాలు.. చివరకు పాపం పండటంతో..

ABN , First Publish Date - 2023-04-25T19:39:37+05:30 IST

ఆస్ట్రేలియాలో మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారాం చేసిన కేసులో ఓ ప్రముఖ భారతీయుడు దోషిగా తేలాడు.

ఆస్ట్రేలియాలో మహిళలపై భారతీయుడి అరాచకాలు.. చివరకు పాపం పండటంతో..

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియాలో(Australia) మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారాం చేసిన కేసులో ఓ ప్రముఖ భారతీయుడు దోషిగా తేలాడు. ఈ కేసులో ప్రముఖ భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధంకర్‌పై(Balesh Dhankar) విచారణ చేపట్టాలంటూ సిడ్నీలోని డిస్ట్రిక్ట్ కోర్టు జ్యూరీ సోమవారం తీర్పు వెలువరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నిందితుడు కొరియన్ మహిళలనే టార్గెట్‌గా ఎంచుకున్నాడు. పేదరికంలో అలమటిస్తున్న యువతులను అనువాదకుల ఉద్యోగాల పేరుతో హోటల్‌కు రప్పించి ఉచ్చులో దింపేవాడు.

ఆ తరువాత రకరకాల కారణాలతో వారిని మోసపుచ్చి సిడ్నీలోని తన స్టూడియో అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లేవాడు. ఆ తరువాత వారిపై అత్యాచారానికి ఒడిగట్టేవాడు. తన బెడ్ పక్కన ఎవరికీ కనిపించకుండా దాచిన కెమెరాతో ఇదంతా రికార్డు చేసేవాడు. ఈ వీడియోలను స్టోర్ చేసేందుకు ఒక్కో బాధితురాలి పేరిట తన కంప్యూటర్లో ఫోల్డర్ క్రియేట్ చేసేవాడని పోలీసులు తెలిపారు. మొత్తం ఐదుగురు మహిళలు అతడి పాలపడ్డట్టు చెప్పారు.

ఈ క్రమంలో ఓ బాధితురాలు తనకు జరిగిన దారుణం గురించి బయటపెట్టడంతో ధంకార్ పాపం పండింది. 2018 అక్టోబర్ 21న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తాను ఎవరినీ బలవంతం చేయలేదని ధంకర్ తొలుత కోర్టులో వాదించాడు. కానీ.. సాక్ష్యాధారాలన్నీ పరీక్షించిన మీదట జ్యూరీ అతడిని దోషిగా తేల్చింది. ఈ క్రమంలో ధంకర్ తన జీవితంలో ఒంటరి ఈ పరిస్థితికి కారణమని చెప్పాడు. వివాహేతర సంబంధం కారణంగా తన పెళ్లి పెటాకులైందని, ఒంటరి తనం వేధించిందని చెప్పుకొచ్చాడు. మేనెలలో కోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం వచ్చే ఏడాది చివర్లో అతడికి శిక్ష పడే అవకాశం ఉంది.

Updated Date - 2023-04-25T19:39:40+05:30 IST