Indian Passport: భారతీయుడినంటూ పాస్‌పోర్ట్ చూపించాడు.. అనుమానంతో అధికారులు అతడిని జాతీయగీతం పాడమన్నారు.. అంతే..
ABN , First Publish Date - 2023-01-28T11:28:24+05:30 IST
అది ఎయిర్ అరేబియా విమానం (Air Arabia Flight). షార్జా నుంచి కోయంబత్తూర్ వచ్చింది.
కోయంబత్తూర్: అది ఎయిర్ అరేబియా విమానం (Air Arabia Flight). షార్జా నుంచి కోయంబత్తూర్ వచ్చింది. విమానాశ్రయంలో దిగగానే అధికారులు ఎప్పటిలాగే ప్రయాణికుల సాధారణ చెకింగ్ మొదలెట్టారు. ఈ క్రమంలో వారికి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడికి భారత పాస్‌పోర్ట్ (Indian Passport) ఉంది. కానీ, అతడు భారతీయు పౌరుడు (Indian Citizen) కాదు అనే విషయం అధికారులు గ్రహించారు. వెంటనే అతడిని పక్కకు తీసుకెళ్లి విచారించారు. అదే సమయంలో అతడికి తాను భారతీయుడేనని నిరూపించుకునేందుకు ఓ స్పెషల్ టెస్టు కూడా పెట్టారు. అంతే.. ఆ టెస్టులో అతడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దాంతో అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతడి పేరు అన్వర్ హుస్సేన్ . షార్జాలో టైలర్‌గా (Sharjah Tailor) పని చేస్తున్నాడు. సెలవులపై ఇటీవల భారత్‌కు (India) వచ్చిన అన్వర్ గత సోమవారం కోయంబత్తూర్ విమానాశ్రయంలో దిగాడు. అతడికి తమిళనాడులోని తిరుప్పూర్ చిరునామాతో భారత పాస్‌పోర్ట్ ఉంది. కానీ, ఎయిర్‌పోర్ట్ అధికారులకు అతడు భారతీయ పౌరుడు కాదు అనే అనుమానం వచ్చింది. దాంతో అన్వర్‌ను పక్కకు తీసుకెళ్లి విచారించారు. ఆ సయమంలో అధికారులు అడిగిన ప్రశ్నలకు అతడు చెప్పిన సమాధానాలు పొంతనలేకుండా ఉన్నాయి. దాంతో అధికారుల అనుమానం మరింత బలపడింది. చివరగా అతడిని భారత జాతీయగీతం పాడమని అడిగారు. అంతే.. మనోడికి నోటమాట రాలేదు. వెంటనే అసలు విషయం చెప్పేశాడు.
తనది బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లా ప్యారీ గ్రామం అని, 2018లో తమిళనాడులోని తిరుప్పూర్‌లో కొన్నాళ్లు పని చేసిన్నట్లు చెప్పాడు. ఆ సమయంలోనే అక్కడి స్థానిక చిరునామాతో మొదట ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ పొందాడట. ఆ తర్వాత వాటితోనే 2020లో భారత పాస్‌పోర్ట్ సంపాదించాడు. అనంతరం అదే పాస్‌పోర్ట్‌తో యూఏఈ వెళ్లిపోయాడు. ప్రస్తుతం షార్జాలో టైలరింగ్ పని చేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇండియాకు వచ్చి పట్టుబడ్డాడు. అధికారులు అన్వర్ హుస్సేన్‌పై ఫారిన్ యాక్ట్ (Foreigners Act) కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.