UAE: 6నెలలకు మించి దేశం బయట ఉన్నారా? అయితే వెంటనే ఈ పని చేయకపోతే మీకు యూఏఈలో నో ఎంట్రీ..!
ABN , First Publish Date - 2023-01-30T10:15:11+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) రెసిడెన్సీ వీసాదారులకు తాజాగా కొత్త కండీషన్ పెట్టింది.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) రెసిడెన్సీ వీసాదారులకు తాజాగా కొత్త కండీషన్ పెట్టింది. ఆరు నెలలకు మించి దేశం బయట ఉంటే తిరిగి దేశంలోకి ప్రవేశించేందుకు రీ-ఎంట్రీ పర్మిట్ (Re-Entry Permit) పొందాలని తెలిపింది. లేనిపక్షంలో యూఏఈలోకి ఎంట్రీ ఉండబోదని తేల్చి చెప్పింది. దీనికోసం ఆన్‌లైన్ సర్వీస్‌ను (Online Service) అందుబాటులోకి తెచ్చింది. నివాసితులు ఎవరైతే రీ-ఎంట్రీ పర్మిషన్ కోసం దరఖాస్తు చేస్తారో వారు తప్పనిసరిగా దేశం 6నెలలకు మించి ఉండడానికి గల కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. అంతేగాక దాని తాలూకు ప్రూఫ్స్ కూడా చూపించాల్సి ఉంటుంది.
ఇక రెసిడెంట్స్ ఈ సర్వీస్ కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) వెబ్‌సైట్‌ను సందర్శించాలని సంబంధిత అధికారులు వెల్లడించారు. స్మార్ట్ సర్వీసుల విభాగంలో దీనికి '6 నెలలకు పైగా యూఏఈ (UAE) వెలుపల ఉండటానికి అనుమతిని జారీ చేయండి' పేరుతో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక ఆన్‌లైన్ ఆప్లికేషన్‌లో దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత, స్పాన్సర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు పాస్‌పోర్ట్, రెసిడెన్సీకి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి. అలాగే దరఖాస్తులో ప్రధానంగా దేశం బయట 6నెలలకు మించి స్టే చేయడానికి గల కారణాన్ని తెలియజేయడం తప్పనిసరి.
ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఐసీపీ (ICP) నుండి ఆమోదం పొందుతూ ఇమెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే దరఖాస్తుదారు దేశంలోకి తిరిగి ప్రవేశించగలరు. ఈ ఆమోదం ప్రక్రియ ఐదు రోజులు పడుతుంది. ఇంతకుముందు ఈ ప్రక్రియ దరఖాస్తుదారు నేరుగా సంబంధిత కార్యాలయాలకు వెళ్లి, దేశం బయట ఉండటానికి గల కారణాలను తెలియజేస్తూ రీ-ఎంట్రీ పర్మిషన్ పొందేవారు. కానీ, కరోనా తర్వాత నుంచి వ్యక్తిగతంగా వెళ్లడానికి బదులుగా ఇలా ఆన్‌లైన్ సర్వీసును తీసుకురావడం జరిగింది.