Viveka Murder Case : ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిలా.. జైలా.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. కాసేపట్లో కీలక పరిణామమేనా..!?
ABN , First Publish Date - 2023-04-18T13:16:27+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో 2019 నుంచి సంచలనంగా మిగిలిపోయిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో...
తెలుగు రాష్ట్రాల్లో 2019 నుంచి సంచలనంగా మిగిలిపోయిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ (CBI) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఏప్రిల్-30లోపు ఈ కేసును క్లోజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy) సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే భాస్కర్ రెడ్డి తర్వాత ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని తప్పకుండా సీబీఐ అరెస్ట్ చేస్తుందని పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే అవినాష్ ముందస్తుగా తెలంగాణ హైకోర్టులో (TS High Court) బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై సోమవారం నాడు విచారణ జరగ్గా.. ఇవాళ్టికి వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నంలోపు బెయిల్‌పై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ముందస్తు బెయిల్‌పై 78 నెంబర్‌లో పిటిషన్ లిస్ట్ అయ్యింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌ను జస్టిస్ సురేందర్ బెంచ్ విచారించనుంది. అయితే.. సాయంత్రం 4 గంటలకు అవినాష్‌ను విచారించాలని సీబీఐని సోమవారం నాడే హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన విచారణకు వెళితే పరిస్థితేంటి..? విచారణకు వెళ్లేలోపు బెయిల్ సంగతి తేలితే సరే.. లేకుంటే పరిస్థితేంటి..? విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా..? విచారించి వదిలేస్తారా..? ఇప్పుడీ ప్రశ్నలు వైసీపీని.. ఇటు అవినాష్ అభిమానులను తొలుస్తున్న ప్రశ్నలు.
ఏం జరుగుతుందో..!?
వివేకా హత్య కేసు మొదట్నుంచీ అనేక మలుపులు తిరిగింది. ఇప్పుడు సీబీఐ విచారణలో అవినాష్ వంతు రావడంతో ఈ వ్యవహారం ఉత్కంఠగా మారింది. పైగా ఇవాళే అటు సీబీఐ విచారణ.. ఇటు ముందస్తు బెయిల్‌పై పిటిషన్‌పై విచారణ కూడా ఉండటంతో ఏం జరుగుతుందో అని సర్వత్రా టెన్షన్ మొదలైంది. సోమవారం నాడు హైకోర్టులో జరిగిన అవినాష్ పిటిషన్ విచారణలో ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి (T Niranjan Reddy).. సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌కుమార్ (CBI Lawyer Anil Kumar) తమ వాదనలు వినిపించారు. ఇదంతా రాజకీయ కోణంలో జరుగుతోందని నిరంజన్ రెడ్డి చెప్పగా.. బెయిల్ ఇవ్వొద్దని పదే పదే సీబీఐ చెప్పడంతో ఇవాళ విచారణకు వెళ్తే పరిస్థితి ఏంటని వైసీపీలో గుబులు మొదలైంది. అంతేకాదు.. అవినాష్ విచారణకు వస్తే అరెస్ట్ చేస్తారా..? అని హైకోర్టు జస్టిస్ కె.సురేందర్ ధర్మాసనం ప్రశ్నించగా.. అరెస్ట్ చేయాల్సి వస్తే కచ్చితంగా చేస్తామని సీబీఐ తేల్చి చెప్పేసింది. విచారణకు రమ్మని నోటీసులిచ్చిన ప్రతీసారి ఇలాగే కోర్టును ఆశ్రయిస్తున్నారని.. అవినాష్‌ను విచారించాల్సింది చాలానే ఉందని కోర్టుకు సీబీఐ వివరించింది. సాక్షాలను తారుమారు చేయడంలో అవినాష్ పాత్ర కీలకమైనదని సీబీఐ తరఫు లాయర్.. కోర్టులో వాదనలు కూడా వినిపించారు. దీంతో అవినాష్‌కు బెయిల్ వస్తుందా..? లేకుంటే అరెస్ట్ పక్కానేనా..? అనేదానిపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెద్ద చర్చే నడుస్తోంది.
మొత్తానికి చూస్తే.. హైకోర్టులో ముందస్తు బెయిల్ (Anticipatory Bail) పిటీషన్‌పై తీర్పు ఆధారంగా తదుపరి పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే.. అవినాష్ కోరుకున్నట్లుగా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ వస్తే సీబీఐ విచారణ సమాచార సేకరణకే పరిమితం కానుంది. ఒకవేళ బెయిల్ (Bail) తిరస్కరిస్తే మాత్రం అవినాష్‌ను సీబీఐ ఏం చేయబోతోందన్నది మరో కీలక అంశమే. ఫైనల్‌గా ఏం జరుగుతుందో ఏంటో మరి.