Nizamabad: అధికారులను మార్చుకునే పనిలో బీఆర్ఎస్ నేతల నిమగ్నం..అనుకూలంగా లేని వారే టార్గెట్..!
ABN , First Publish Date - 2023-03-02T13:20:53+05:30 IST
పాలకులు ఇస్తున్న సంకేతాలతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రధానంగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అప్రమత్తమయ్యారు. ముఖ్యమైన అధికారులను...
వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో ఆ జిల్లా అధికారపార్టీ నేతలు అలెర్ట్ అవుతున్నారు. ఎన్నికల్లో సానుకూలంగా గట్టెక్కేందుకు అనుకూలమైన అధికారుల కోసం వేట సాగిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆర్డీవో స్థాయి వరకు ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే.. కొందరు రాగా.. ప్రజాప్రతినిధుల కొత్తగా వచ్చే వారికోసం చేస్తున్న కసరత్తులు ఆ జిల్లాలో ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ.. ఏంటా జిల్లాలో?.. అధికారుల కోసం ప్రజాప్రతినిధులు ఎలాంటి వేట కొనసాగిస్తున్నారు?..మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
కొత్తవారిని రప్పించుకోవడంలో బిజీ
పాలకులు ఇస్తున్న సంకేతాలతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రధానంగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అప్రమత్తమయ్యారు. ముఖ్యమైన అధికారులను మార్చుకుంటున్నారు. అనుకూలంగా లేని వారిని పంపించడం, కొత్తవారిని రప్పించుకోవడంలో బిజీగా అయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ అధికారుల మార్పిడికి వేగంగా కసరత్తులు జరుగుతున్నాయి. ఇటీవలే బదిలీ అయిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి దాదాపు మూడేళ్ళు పనిచేశారు. ఆయన అందరివాడిగా ముద్ర వేసుకున్నారు. వివాదాలకు దూరంగా, ప్రజాప్రతినిధులకు దగ్గరగా పని చేసి.. జిల్లాలో పూర్తిస్థాయి సేవలందించారు. దానికి ప్రతిఫలంగా మరో జిల్లా కలెక్టర్‌గా వెళ్ళారు. ఆయన స్థానంలో రాజీవ్‌గాంధీ హనుమంతు బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఆయన ఎంపిక కోసం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తీవ్ర కసరత్తులు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆమోదముద్ర పడ్డాకే ఆయన నిజామాబాద్ కలెక్టర్‌గా నియమితులయ్యారని తెలుస్తోంది. వారి ఆలోచనలకు అనుగుణంగా పని చేసే కీలక బాధ్యతను చేపట్టారు. అయితే.. ఎన్నికల సీజన్‌లో వచ్చిన హనుమంతు పనితీరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
నాన్ క్యాడర్ ఐపీఎస్ నియామకానికి ప్రయత్నాలు
మరోవైపు.. నిజామాబాద్ పోలీస్ బాస్ కూడా మారబోతున్నారు. త్వరలోనే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త బాస్ రానున్నారు. ఇప్పుడున్న పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు మార్చి 31న రిటైర్ కాబోతున్నారు. ఆయన కూడా అధికార పార్టీ నేతల ఒప్పు, మెప్పు పొందేలా ఫ్రెండ్లీ సేవలందించారు. ఓ దశలో గులాబీ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అయితే.. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆ స్థానంలో ఓ నాన్ క్యాడర్ ఐపీఎస్‌ను నియమించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి జిల్లాకు చెందిన ఓ అగ్రనేత పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేల ఆమోదం పొందాక, సీఎం స్థాయిలో ఆయన పోస్టింగ్ ఖరారు చేసుకునేందుకు కసరత్తులు కొనసాగుతున్నాయి. ఆ లోపు జిల్లాలోని అధికార పార్టీ నేతల ఆమోదం పొందేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రెవెన్యూ, పోలీసు శాఖలపైనే ప్రధానంగా ఫోకస్
ఇదిలావుంటే.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిథులు, నేతలు.. రెవెన్యూ, పోలీసు శాఖలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. పాలనా వ్యవస్థలో కీలక స్థానాల్లోని అధికారులు అనుకూలంగా ఉండాలనే ఆలోచనతో వేట సాగిస్తున్నారు. దానికోసం ఆయా విభాగాల్లో మచ్చికైన, మన్నికైన అధికారుల కోసం అన్వేషణ సాగుతోంది. ఇప్పటికే.. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. ఆయనది రొటీన్ బదిలీగా చెబుతున్నప్పటికీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకమై పట్టుబట్టి మరీ సాగనంపినట్లు ప్రచారం జరుగుతోంది. వారికి ఓ ఉన్నతాధికారి సైతం సహకరించారని టాక్ నడుస్తోంది. రెండేళ్ళ పదవీకాలం పూర్తి కాని వెంకటేశ్వర్లు.. ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించారు. కానీ.. ఎన్నికల వేళ భరించలేమని ఇద్దరు ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవడంతో మంత్రుల స్థాయిలో పావులు కదిపి.. అనుకున్నది సాధించారు. ఆ క్రమంలోనే.. ఇద్దరేసి అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఏసీపీలకు స్థానచలనం జరగనున్నట్లు తెలుస్తోంది.
బదిలీపై వచ్చినవారికి ఉద్యోగం కత్తిమీద సామే!
నిజానికి.. నిజామాబాద్ జిల్లా అధికారుల బదిలీల్లో ఆర్డీవో, ఏసీపీ, డీఎస్పీ స్థాయి పోస్టులకే డిమాండ్ ఎక్కువగా ఉంది. దాంతో.. జిల్లాకు రావాలని ఉవ్విళ్ళూరుతున్న కొందరు అధికారులు.. ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ఎమ్మెల్యే చుట్టూ అరడజను మంది అధికారులు తిరుగుతున్నట్లు చర్చలు సాగుతున్నాయి. అయితే.. ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఇక.. అధికార పక్ష నేతల శరణుగోరుతున్న ఆఫీసర్లు.. అనుకున్న పోస్టు పొందుతారేమో కానీ.. వారి పయనం మాత్రం కత్తిమీద సామే అన్న టాక్ వినిపిస్తోంది. సవాలక్ష సమస్యలను అధిగమించి సమర్థతను చాటుకోవాల్సి ఉంటుంది. అటు పాలకులు, ఇటు ప్రజలను ఒప్పించి, మెప్పించాలి. విపక్షాల విమర్శలకు దొరక్కుండా సామరస్యపూర్వకంగా పని చేయాలి. మొత్తంగా.. నిజామాబాద్ జిల్లాకు రానున్న అధికారులు.. అధికార, ప్రతిపక్ష రాజకీయాలను ఏ మేరకు తట్టుకుని నిలబడతారో చూడాలి మరి.