TS Politics: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.. వైఎస్ఆర్టీపీ గుర్తు ఇదే..!!
ABN , First Publish Date - 2023-10-26T20:45:54+05:30 IST
వైఎస్ షర్మిలారెడ్డి స్థాపించిన పార్టీ వైఎస్ఆర్టీపీకి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది. ఈ మేరకు బైనాక్యులర్ గుర్తును ఫిక్స్ చేసింది.
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి. తమ పార్టీ గుర్తుకు ఓటు వేయాలని ప్రజల దగ్గరకు వెళ్లి విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలతో తొలిసారి బరిలోకి దిగుతున్న వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ వైఎస్ఆర్టీపీకి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది. ఈ మేరకు బైనాక్యులర్ గుర్తును ఫిక్స్ చేసింది. 119 నియోజకవర్గాల్లో ఒకే గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైఎస్ఆర్టీపీ కూడా అభ్యర్థులను ప్రకటించి తమ బైనాక్యులర్ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమైంది.
ఇది కూడా చదవండి: RGV : ‘నేను బయట.. ఆయన లోపల’.. ఆడుకుంటున్న టీడీపీ శ్రేణులు!!
2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీలో అన్న వైఎస్ జగన్‌తో విభేదాలు రావడంతో ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)ని ప్రకటించి ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. తెలంగాణలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తొలి భారతీయ మహిళగా షర్మిల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చేరారు. కాగా తాను స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు వైఎస్ షర్మిలారెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. ఈ మేరకు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీలతో మంతనాలు జరిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనానికి సంబంధించి దాదాపు నాలుగు నెలల పాటు ఎదురుచూసినా కాంగ్రెస్ నుంచి షర్మిలకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో ఒంటరిగానే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు షర్మిల సిద్ధమయ్యారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే షర్మిల స్పష్టం చేశారు.