KCR Cabinet : పట్నం మహేందర్ రెడ్డికి రెండు శాఖలు కేటాయించిన కేసీఆర్.. ట్విస్ట్ ఇచ్చిన కొత్త మంత్రి..!?
ABN , First Publish Date - 2023-08-24T22:05:46+05:30 IST
రాజ్‌భవన్ వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (Governor Tamilsai, CMKCR) సమక్షంలో ఇవాళ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి పట్నంకు రెండు శాఖలను గులాబీ బాస్ కేటాయించారు..
రాజ్‌భవన్ వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (Governor Tamilsai, CMKCR) సమక్షంలో ఇవాళ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి పట్నంకు రెండు శాఖలను గులాబీ బాస్ కేటాయించారు. భూగర్భ గనుల శాఖ, సమాచార శాఖలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మూడునాళ్ల ముచ్చటకు రెండు శాఖలు ఇస్తే ఏంటి.. పది శాఖలు ఇస్తే పోయేదేముంది..? అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. అయితే తనకు కేటాయించిన శాఖపై పట్నం స్పందించారు. ‘కేబినెట్‌లో చేర్చుకున్న కేసీఆర్‌కు ధన్యవాదాలు. మంత్రి పదవితో రాజీ పడినట్టు కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీపై పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుంది’ అని మహేందర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అంటే.. మంత్రి పదవి ఇచ్చినంత మాత్రన రాజీ పడినట్లు కాదని.. పొంగిపోనని.. పోటీపై నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో అధికార పార్టీలో అలజడి నెలకొన్నట్లయ్యింది. కొత్త మంత్రి ఇచ్చిన ఈ ట్విస్ట్‌తో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.
ఇలా బుజ్జగింపులు..!
కాగా.. తాండూరు (Tandur) ఎమ్మెల్యే టికెట్‌ను పట్నంను కాదని కాంగ్రెస్ నుంచి కారెక్కిన ఫైలట్ రోహిత్ రెడ్డికి (Pilot Rohit Reddy) ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. చాలా రోజులుగా కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) ప్రకటించిన తర్వాత ఫైలట్ రోహిత్ వెళ్లి పట్నంను కలవడం.. ఇద్దరూ వచ్చి మళ్లీ కేసీఆర్‌ను కలవడం.. అసంతృప్తిగా ఉన్న మహేందర్ రెడ్డిని బుజ్జగించడం.. చివరికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని కూడా కేసీఆర్ మాటిచ్చారట. జాబితాను ప్రకటించిన బీఆర్‌ఎస్, ఆ అసంతృప్త నేత విషయంలో పట్టు సడలించి మెట్టు దిగింది. మొన్నటిదాకా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి విషయంలో దూరం పాటించినా చివరకు రాజీపడిపోయింది. ఇన్నాళ్లు తాము చెప్పిందే వేదం అన్న రీతిలో వ్యవహరించిన బీఆర్‌ఎస్ అధినాయకత్వం ఇప్పుడు ధిక్కార స్వరం వినిపించిన పట్నంను అందలమెక్కించింది. చిత్రం ఏమిటంటే ఆయన్ను సాగనంపేందుకు పొగబెట్టిన వారితోనే ఆయన కాళ్లు మొక్కించడం గమనార్హం.
వెనక్కి తగ్గిన గులాబీ బాస్..!
తాండూరు టికెట్ మరోసారి తనకే ఇవ్వాలని, లేదంటే తనదారి తాను చూసుకుంటానని మహేందర్‌రెడ్డి అధినాయకత్వానికి అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి గెలుపొంది తమ పార్టీలో చేరిన పైలెట్ రోహిత్‌రెడ్డికే తాండూరు టికెట్ ఇస్తున్నట్లు బీఆర్‌ఎస్ నాయకత్వం ఇటీవల మహేందర్‌రెడ్డికి సంకేతాలు పంపింది. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మహేందర్‌రెడ్డి తనతో పాటు జిల్లాలో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలతో పలుదఫాలుగా రహస్య సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నేతలతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన అసమ్మతి నేతలూ ఇందులో ఉన్నారు. మూకుమ్మడిగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొద్దిరోజులుగా పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న మహేందర్‌రెడ్డిని ‘పార్టీలో ఉంటే ఉండమను.. లేదంటే పొమ్మను’ అంటూ సంకేతాలు ఇచ్చిన కేసీఆర్ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. అంతేనా, మహేందర్‌రెడ్డి డిమాండ్ చేసిందే తడువు మంత్రివర్గంలో తీసుకునేందుకు నిర్ణయించడం.. రోజుల వ్యవధిలోనే ప్రమాణ స్వీకారం కూడా చేయించేశారు. ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అధికార పార్టీ మంత్రివర్గ విస్తరణ చేపట్టడం అరుదనే చెప్పాలి. దీంతో పట్నం తన పంతాన్ని నెగ్గించుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైతే మహేందర్ రెడ్డి శాంతించారు.. ఈ పదవి పోయిన తర్వాత పరిస్థితేంటి..? పట్నం విషయంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై మహేందర్ అభిమానులు, అనుచరుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.