CM KCR Governor Tamilisai: గవర్నర్‌పై సీఎం కేసీఆర్‌కు ఇంత అభిమానం ఉందా..?

ABN , First Publish Date - 2023-08-25T21:15:08+05:30 IST

‘‘మీరు మారిపోయారు సార్.. మీరు మారిపోయారండీ’’. ‘టెంపర్‌’ అనే తెలుగు సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తన ఈ డైలాగ్‌కు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ గవర్నర్‌తో ఇన్నాళ్లూ అంటీముట్టనుట్టు వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సీఎస్ సమేతంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను స్వయంగా సచివాలయానికి తీసుకెళ్లారు. కొత్త సచివాలయంలో ప్రార్థన మందిరాలను గవర్నర్‌తో దగ్గరుండి ప్రారంభింపజేశారు.

CM KCR Governor Tamilisai: గవర్నర్‌పై సీఎం కేసీఆర్‌కు ఇంత అభిమానం ఉందా..?

‘‘మీరు మారిపోయారు సార్.. మీరు మారిపోయారండీ’’. ‘టెంపర్‌’ అనే తెలుగు సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తన ఈ డైలాగ్‌కు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ గవర్నర్‌తో ఇన్నాళ్లూ అంటీముట్టనుట్టు వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సీఎస్ సమేతంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను స్వయంగా సచివాలయానికి తీసుకెళ్లారు. కొత్త సచివాలయంలో ప్రార్థన మందిరాలను గవర్నర్‌తో దగ్గరుండి ప్రారంభింపజేశారు. ఆమెకు సచివాలయంలోని ఒక్కో అంతస్తు గురించి వివరించారు. ఆమెకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన శాంతకుమారితో బొట్టు పెట్టించారు. అనంతరం.. గవర్నర్‌కు సచివాలయంలో శాలువా కప్పి సత్కరించారు. అతిథి మర్యాదలన్నీ చేసి ఆమె కారులో ఎక్కేంత వరకూ దగ్గర ఉండి మరీ సాగనంపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌లో అనూహ్యంగా కనిపించిన ఈ మార్పుపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఇన్నాళ్లూ గవర్నర్‌ తమిళిసైకి, ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.

2.jpg


రాజ్‌ భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య సఖ్యత కరువైంది. గవర్నర్‌ తమిళిసైని బీజేపీ నాయకురాలిగా బీఆర్‌ఎస్‌ నేతలు అభివర్ణించారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సహా అధికారిక కార్యక్రమాలకు వేటికీ ఆమెను ఆహ్వానించలేదు. అలాగే, నాలుగేళ్లుగా ఎట్‌హోం సహా రాజ్‌భవన్లో జరిగిన కార్యక్రమాలకూ సీఎం, మంత్రులు, బీఆర్‌ఎస్‌ నాయకులు హాజరు కాలేదు. ఇంకా చెప్పాలంటే, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలనూ గవర్నర్‌ ప్రసంగం లేకుండానే పూర్తి చేశారు. చివరికి, ఈ అంశం హైకోర్టుకు చేరడం.. కోర్టు బయట పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించడంతో గత బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించక తప్పని పరిస్థితి నెలకొంది. అలాగే, పెండింగ్‌ బిల్లులను గవర్నర్‌ ఆమోదించడం లేదంటూ రాజ్‌భవన్‌పై సుప్రీం కోర్టునూ తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఇక, గవర్నర్‌ కూడా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

1.jpg

ప్రభుత్వం తనను గుర్తించడం లేదని, గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ హోదాకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌నూ ఇవ్వడం లేదని తమిళిసై పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. కనీసం ఒక మహిళకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా తనకు ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జిల్లాలకు వెళ్లినప్పుడు కలెక్టర్‌, అధికారులు తనకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌ ఇవ్వడం లేదని పలుమార్లు ఆరోపించారు. ప్రభుత్వం వాహన సదుపాయం కల్పించకపోవడంతో సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆమె బస్సులోనే వెళ్లారు. భద్రాద్రిలో వరదల పరిస్థితిని పరిశీలించడానికీ రైల్లోనే వెళ్లారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి కానీ, అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు కానీ తనను ఆహ్వానించలేదని, ఆహ్వానిస్తే వెళ్లేదానినని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. క్యాబినెట్‌, అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులను తిరస్కరించారు. కొన్నిటిని రాష్ట్రపతికి పంపించారు. ఆర్టీసీ బిల్లును న్యాయ పరిశీలనకు పంపారు. దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించే బిల్లును పెండింగులో పెట్టారు. ఇలా.. దాదాపు నాలుగేళ్లుగా గవర్నర్‌, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది.

3.jpg

ఇప్పటి వరకూ రాజ్‌భవన్‌ గడప తొక్కడానికి విముఖత వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు వీలైనంత ఎక్కువ సమయాన్ని అక్కడ గడిపారు. గవర్నర్‌తో ముఖాముఖి సమావేశమయ్యారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించలేదు. కానీ, సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. ఆమె కూడా పాత విషయాలన్నీ మర్చిపోయి ఆహ్వానాన్ని మన్నించి సచివాలయానికి వెళ్లారు.

4.jpg

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, ఇప్పుడు గవర్నర్‌తో సఖ్యతకు కూడా కారణం ఇదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు ఇటీవల వరుసగా జరిగిన పరిణామాలను ఉదాహరిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ తనయ కవిత వ్యవహారం చల్లబడడం.. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడం, కమ్యూనిస్టులతో పొత్తును కాలదన్నడం, ఇప్పుడు గవర్నర్‌తో సఖ్యత అన్నీ ఒకదానితో మరొకటి లింకున్న అంశాలేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి సఖ్యత కుదరడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసిన పరిణామంగా చెప్పక తప్పదు.

Updated Date - 2023-08-25T21:22:11+05:30 IST