MLA Seethakka : ఎన్నికల బరిలో సీతక్క కొడుకు.. ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారంటే.. గెలుపు పక్కానేనా..!?
ABN , First Publish Date - 2023-08-25T20:06:45+05:30 IST
సీతక్క... తెలుగు సమాజానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అసలు పేరు ధనసరి అనసూయ (Dhanasari Anasuya) అంటే అందరికీ గుర్తొస్తారో లేదో గానీ సీతక్క(Seethakka) అని చెబితే మాత్రం ఠక్కున గుర్తుకొచ్చేస్తారు. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఆమె ప్రత్యేకత..
సీతక్క... తెలుగు సమాజానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అసలు పేరు ధనసరి అనసూయ (Dhanasari Anasuya) అంటే అందరికీ గుర్తొస్తారో లేదో గానీ సీతక్క(Seethakka) అని చెబితే మాత్రం ఠక్కున గుర్తుకొచ్చేస్తారు. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఆమె ప్రత్యేకత. నక్సలైట్ (Naxalite) జీవితం నుంచి జనజీవన స్రవంతిలోకి, ఆ తర్వాత చదువు, అనంతరం రాజకీయ అరంగేట్రం.. ఇవన్నీ సీతక్కను ప్రత్యేక వ్యక్తిగా నిలుపుతున్నాయి. ఇక రాజకీయ జీవితంలోనూ ఆమె తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారన్న పేరుంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని కొండ, కోనల్లోని గిరిపుత్రులతో సైతం ప్రత్యక్షంగా మమేకమవుతుంటారామె. సాదకబాధకాలు తెలుసుకొని చేయగలిగిన సాయం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడామె తన వారసుడు సూర్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. పార్టీ పెద్దల మద్దతుతో కుమారుడి కోసం ఓ నియోజకవర్గాన్ని కూడా రెడీ చేయడం.. ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) కోసం అప్లికేషన్ కూడా వేయడం జరిగింది. ఇంతకీ ఎక్కడ్నుంచి పోటీచేస్తున్నారు..? ప్రత్యేకించి ఆ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనే విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనం..
ఇదీ అసలు కథ..!
ప్రజాసేవ చేయడానికి సీతక్క తన కుమారుడు సూర్యను (Dhanasari Surya) రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) పోటీచేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నియోజకవర్గమైన పినపాక అసెంబ్లీ (Pinapaka Assembly) నుంచి పోటీచేయడానికి అప్లికేషన్ వేశారు. అటు ఢిల్లీ అధిష్టానం.. ఇటు తెలంగాణ సీనియర్ నేతలు కూడా సూర్య అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నాడు అప్లికేషన్‌కు చివరి రోజు కావడంతో సూర్య పినపాక కోసం దరఖాస్తు చేశారు. అంటే టికెట్ ఫిక్స్ అయిపోయనట్లేనన్న మాట. వాస్తవానికి ఈసారి పినపాకలో రాజకీయం రసవత్తరంగా సాగనుంది. గత కొన్ని నెలలుగా సూర్య.. పినపాకలో తిష్టవేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. నిత్యం జనాల్లో తిరుగుతుండేవారు. రోజుకో మండలం చొప్పున రాత్రి, పగలు అనే తేడా లేకుండా విస్తృతంగా పర్యటనలు చేసిన రోజులున్నాయి. కొన్ని.. కొన్ని మండలాల ప్రజలైతే సీతక్క కుమారుడు ఎప్పుడు వస్తాడా?.. తమ సమస్యలను పరిష్కరిస్తారా..? అని గుమ్మంలో ఎదురుచూసిన పరిస్థితులు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పినపాక నుంచి సీతక్క పోటీచేసి.. ములుగు నుంచి సూర్య పోటీచేస్తారని ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. సీతక్క పోటీచేస్తే కచ్చితంగా పినపాక కాంగ్రెస్ ఖాతాలోనే పడుతుందని అధిష్టానం భావించిందట. అయితే ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. చివరి నిమిషంలో ఇలా సీన్ మారిపోయింది.
ఎమ్మెల్యేపై ఎనలేని వ్యతిరేకత..!
ఎస్టీ నియోజకవర్గమైన పినపాకలో 2018 ఎన్నికల్లో రేగా కాంతారావు (Rega Kantha Rao) కాంగ్రెస్ తరఫున పోటీచేసి.. బీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుపై 19,565 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే.. ఎన్నోరోజులు కాంగ్రెస్‌లో ఉండలేదు. గెలిచిన పార్టీకి.. గెలిపించిన ప్రజలను కాదని.. కారెక్కేశారు. రేగాకే టికెట్ కన్ఫామ్ చేసింది కారు పార్టీ. అప్పట్లోనే బీఆర్ఎస్ నేతలు రావొద్దని.. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అధికార పార్టీలో చేరొద్దని పెద్ద రాద్ధాంతమే చేశారు కానీ.. ఆ తర్వాత మామూలైపోయింది. అయితే.. కేసీఆర్ పంచన చేరినప్పటికీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని.. ఒక్క సమస్యా పరిష్కరించిన పాపాన పోలేదనే ఆరోపణలు మెండుగానే ఉన్నాయి. రేగా బీఆర్ఎస్ లోకి రావటంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) గులాబీ గూటిలో ఇమడలేకపోయారు. నాటి నుంచి నేటి వరకూ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులున్నాయి. ఆ మధ్య పాయంనే కాంగ్రెస్ నుంచి బరిలో దించుతారని ప్రచారం జరిగింది. సరిగ్గా ఇదే సమయంలోనే సీతక్క కుమారుడు రంగంలోకి దిగిపోయారు.
సూర్యా.. గెలిపించుకుంటాం..!
రేగా కారెక్కిన తర్వాత పినపాక కాంగ్రెస్ కార్యకర్తలకు.. ప్రజలకు అన్నీ తానై చూసుకుంటూ వస్తున్నారు సూర్య. కాంగ్రెస్‌ను నమ్ముకున్న క్యాడర్‌లో నమ్మకం పెంచుకున్నారు. సూర్య యువనేత కావడంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. చాలా చురుగ్గా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో తిరుగుతూ వస్తున్నారు. నిత్యం కార్యకర్తలను కలవడం, పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కొందరు నేతలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా పినపాకలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని వీరాభిమానులు చెబుతున్నారు. మరోవైపు.. సీతక్క కూడా తరుచుగా పినపాకకు వెళ్లి వస్తుండేవారు. సూర్యను కచ్చితంగా గెలిపించుకుంటామని.. ప్రజా సమస్యలను పరిష్కరించే నేత కావాలని.. అంతేకానీ గెలిచి కారెక్కేసే నేత వద్దని నియోజకవర్గ ప్రజలు శపథం చేసి కూర్చున్నారు. దీంతో.. ఈసారి అటు ములుగులో.. ఇటు పినపాకలో మళ్లీ కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని అధిష్టానం ధీమాగా ఉంది. వాస్తవానికి.. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల్లో సీతక్క ప్రభావం ఎక్కువన్న విషయం తెలిసిందే. కనీసం పది, పదిహేను స్థానాల్లో సీతక్క ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్‌లో గుబులు మొదలైంది. గత ఎన్నికల్లోనే సీతక్క దూకుడుకు చెక్ పెట్టాలని కారు పార్టీ పెద్దలు కసరత్తులు చేసినా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఏకంగా తనకుమారుడినే పినపాక నుంచే పోటీ చేయిస్తుండటంతో కచ్చితంగా సీతక్క గెలిపించుకుంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.