AP IT Minister: పదేపదే పరువు పోగొట్టుకుంటున్న ఏపీ ఐటీ మంత్రి.. పాపం గుడివాడ..!
ABN , First Publish Date - 2023-01-23T16:43:12+05:30 IST
నిన్నమొన్నటి దాకా కలిసి ఉన్న రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రాజకీయంగా, పాలనాపరంగా పోలిక సహజంగానే ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు ఎలా ఉందో..
నిన్నమొన్నటి దాకా కలిసి ఉన్న రెండు రాష్ట్రాలు (Telugu States) విడిపోయినప్పుడు రాజకీయంగా, పాలనాపరంగా పోలిక సహజంగానే ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు ఎలా ఉందో, ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఎవరికి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చనే చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఈ పోలిక ముఖ్యమంత్రుల మధ్య కాకుండా రెండు రాష్ట్రాల ఐటీ మంత్రుల మధ్య ప్రస్తుతం నడుస్తుండటం కొసమెరుపు. టీడీపీ హయాంలో నారా లోకేష్ (Nara Lokesh) ఐటీ మంత్రిగా పనిచేసినప్పుడు ఈ తరహా చర్చ తెరపైకి రాలేదు. టీడీపీ హయాంలో ఐటీ మంత్రిగా లోకేష్ నిబద్ధతతో పనిచేసిన తీరే ఇందుకు కారణం. కానీ.. ఏపీ ప్రస్తుత ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath).. శాఖ నిర్వహణ కంటే రాజకీయ విమర్శలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుండటంతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను (Telangana IT Minister KTR) చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో (Social Media) నెటిజన్లు హితబోధ చేస్తున్న పరిస్థితి. దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వైసీపీ కేబినెట్‌లో ఐటీ మంత్రిగా చేసినప్పుడు కూడా ఈ తరహా పోలికలు, విమర్శలు రాలేదు.
గుడివాడ అమర్‌నాథ్ మాత్రం చౌకబారు రాజకీయ విమర్శలతో పదేపదే పరువు పోగొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో కేటీఆర్‌తో తనను పోల్చి హితవు పలుకుతుండటాన్ని తట్టుకోలేని స్థాయిలో ప్రస్తుత ఏపీ ఐటీ మంత్రి అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌తో తనను పోల్చవద్దని అమర్‌నాథ్ ఇటీవల కోరారు. హైదరాబాద్‌లో మూడు దశాబ్దాల క్రితమే ఐటీకి బీజం పడడం వల్ల ఈ రోజు ఆ స్థాయిలో ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి కేవలం ఎనిమిదేళ్లే అయిందని ఆ పోలికకు మసిపూసే ప్రయత్నం చేశారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో పోల్చడం సమంజసం కాదని ఎందుకు భావిస్తున్నారు..? విశాఖ నుంచి రెండు నెలల్లో పాలన సాగిస్తామని చెబుతున్న అమర్‌నాథ్.. వైసీపీ హయాంలో ఎన్ని ఐటీ సంస్థలు ఏపీకి వచ్చాయో చెప్పగలరా..? ఏపీ ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ దురవస్థపై ప్రత్యేక కథనం.
గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా జగన్ ఆశీస్సులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏప్రిల్ 2022లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే దావోస్ వాణిజ్య సదస్సుకు సంబంధించి మంత్రి అవగాహనారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటన అనగానే ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అయితే అది పెట్టుబడుల సదస్సు కాదని, ప్రపంచ వాణిజ్య సదస్సు అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రత్యేకతలను, పెట్టుబడుల అవకాశాలను సదస్సులో వివరిస్తామని.. పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఒక్క విదేశీ సదస్సుకూ హాజరు కాలేదన్న విమర్శలు రావడంతో జగన్ 2022లో తొలిసారి దావోస్ సదస్సుకు వెళ్లారు. పరిశ్రమలు ఏపీకి తీసుకొచ్చిందీ అంతంతమాత్రమే. ఈ ఏడాది అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి కాదు కదా.. కనీసం ఐటీ శాఖ మంత్రి కూడా దావోస్‌కు వెళ్లలేదు.
ఈ సంవత్సరం దావోస్‌కు వెళ్లిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఒక్క పెప్సీకో ఒప్పందం వల్లే 4 వేల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ద్వారా వెయ్యికిపైగా ఉద్యోగాలు రానున్నాయని, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎయిర్‌టెల్ డేటా సెంటర్లతో కొత్తగా మరిన్ని ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. మొత్తంగా సుమారు 10 వేలకు పైగా ఉద్యోగాలు దావోస్ పెట్టుబడి ఒప్పందాల ద్వారా లభించనున్నాయని పేర్కొన్నారు. ఈ పర్యటనలో 80 శాతం పెట్టుబడుల మీద దృష్టిపెట్టామని చెప్పిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు.. అది పెట్టుబడుల సదస్సు కాదని, ప్రపంచ వాణిజ్య సదస్సు అని చెప్పి పెట్టుబడులు తీసుకురాలేమని పరోక్షంగా చేతులెత్తేసి చెప్పే అమర్‌నాథ్‌కు మధ్య పోలిక రాకుండా ఎలా ఉంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా.. పవన్‌తో ఫొటో తీసుకున్న ఫొటోను తీసుకొచ్చి.. తనతోనే పవన్ ఫొటో దిగాడని చెప్పడంతో మొదలుకుని పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ చౌకబారు వ్యాఖ్యలు చేయడం అమర్‌నాథ్‌పై నెగిటివిటీని పెంచింది.
సోషల్ మీడియా వేదికగా గుడివాడ అమర్నాథ్‌ను పవన్ ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకున్నారు. కేటీఆర్ తన పనితీరుతో మెప్పిస్తుంటే, గుడివాడ అమర్‌నాథ్ మాత్రం తన డ్యాన్స్‌లతో మెప్పిస్తున్నారని ఏపీ ఐటీ మంత్రి డ్యాన్స్ వీడియోలను వైరల్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్ని పరిశ్రమలను తీసుకొచ్చారో చెప్పలేని దురవస్థలో అమర్‌నాథ్ ఉండటం గమనార్హం. పవన్‌ను, చంద్రబాబును దూషించడమే పనిగా పెట్టుకున్న గుడివాడ అమర్‌నాథ్ తనకు అప్పగించిన శాఖ అసలు పనిని మర్చిపోయినట్టు ఉన్నారని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇకనైనా పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబద్ధతతో పనిచేయాలని హితవు పలుకుతున్నారు. ఇలా.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ఏపీ ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్ మధ్య పోలిక కొన్ని రోజులుగా ట్రెండింగ్ టాపిక్‌గా ఉండటం గమనార్హం.